బ్రహ్మోస్ సూపర్ సోనిక్ ప్రయోగం విజయవంతం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Sep 2020 11:00 AM GMT
బ్రహ్మోస్ సూపర్ సోనిక్ ప్రయోగం విజయవంతం

సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్‌ని భారత్ మరోసారి విజయవంతంగా పరీక్షించింది. 400కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాలను చేదించగలదని శాస్త్రవేత్తలు ప్రకటించారు. బుధవారం ఒడిశాలోని బాలాసోర్ జిల్లా చాందీపూర్ బేస్ వద్ద నుంచి బ్రహ్మోస్‌ను విజయవంతంగా ప్రయోగించారు. జే -10 ప్రాజెక్ట్ కింద భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ) ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఈ క్షిపణిని దేశీయ బూస్టర్‌తో ప్రయోగించడం గమనార్హం. విస్తరించబడిన తర్వాత ఈ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్‌ను పరీక్షించడం ఇది రెండోసారి.

క్షిపణి ప్రయోగం విజయవంతం పట్ల సైంటిస్టులకు డిఆర్‌డిఓ చైర్మన్ జి. సతీష్ రెడ్డి అబినందనలు తెలిపారు. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ భారత సైనిక పాటవానికి అదనపు బలం కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.ఒడిశాలోని ప్రయోగ కేంద్రం నుంచి టెస్ట్ ఫైర్ చేసిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని భూమి మీద నుంచి ప్రయోగించవచ్చు. అదేవిధంగా, సబ్ మెరైన్ల నుంచి, యుద్ధ నౌకల నుంచి, ఫైటర్ జెట్ విమానాల నుంచి ప్రయోగించవచ్చు. ఈ క్షిపణిని రష్యాకు చెందిన ఫెడరల్ స్టేట్ యూనిటరీ ఎంటర్‌ప్రైజ్ ఎన్పీవో మషినో స్ట్రోనియలతో కలిసి డీఆర్డీఓ సంయుక్తంగా నిర్మించింది.

భారతదేశం, రష్యా మధ్య జాయింట్ వెంచర్‌లో భాగంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణిని మొదట 290 కిలోమీటర్ల పరిధితో రూపొందించారు. అయినప్పటికీ, సామర్థ్యాన్ని పెంచడంలో భాగంగా, క్షిపణి పరిధిని 400 కిలోమీటర్లకు విస్తరించింది.Next Story
Share it