అఘోరాగా కనిపించనున్న బాలయ్య
By తోట వంశీ కుమార్ Published on 1 May 2020 3:40 PM ISTటాలీవుడ్ అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ, ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఓ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేశారు. కరోనా మహమ్మారి కారణంగా రెండో షెడ్యూల్ వాయిదా పడింది. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో సింహ, లెజెండ్ వంటి బ్లాక్‌బాస్టర్స్ చిత్రాలు వచ్చాయి. దీంతో ప్రస్తుతం ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక అభిమానుల అంచనాలకు మించి ఈ చిత్రం ఉండనుందని సమాచారం.
తాజాగా ఈ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడారు. ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించనున్నాడని చెప్పారు. అందులో ఓ పాత్ర ఫ్యాక్షనిస్ట్ కాగా.. రెండోది అఘోరా పాత్ర అని అన్నారు. అఘోర గెటప్‌లో బాలయ్యను చూసి ప్రేక్షకులు చాలా థ్రిల్‌గా ఫీలవుతారని చెప్పుకొచ్చాడు. ఇక ఈ చిత్రం కోసం బాలయ్య గుండు కూడా చేయించుకున్నాడు. గుండుతో బాలయ్య సరికొత్తగా కనిపిస్తున్నాడని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నిమిషాల వ్యవధిలో జన్మించిన కవల సోదరుల జీవితాల్లో నవగ్రహాలు.. వారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేసాయనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అమ్మ పొత్తిళ్లలతో విడిపోయిన వీళ్లు మళ్లీ ఎలా కలిసారనేదే ఈ సినిమా స్టోరీ అని అంటున్నారు.