ఆ ఇద్దరిని ఔట్ చేయలేక జోక్‌లు వేసుకున్నాం : అఫ్రిది
By తోట వంశీ కుమార్ Published on 30 May 2020 9:20 AM GMTపాకిస్థాన్ క్రికెట్ బోర్డు తాజాగా ఓ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ ఫోటో ఎప్పటిదో కనిపెట్టమంటూ అభిమానులకు పజిల్ ఇచ్చింది. ఈ ఫోటోలో షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిది ఇద్దరూ నవ్వుతూ కనిపించారు. ఈ ఫోటోపై అఫ్రిది స్పందించాడు.
2006 సంవత్సరంలో టీమ్ ఇండియా పాక్‌లో పర్యటించింది. ఆ పర్యటన అంటే తనకెంతో ఇష్టమని, ఈ ఫోటో లాహోర్ టెస్టులో తీశారని చెప్పుకొచ్చాడు పాకిస్థాన్ ఆల్‌రౌండర్. 'అద్భుతమైన జ్ఞాపకాలు. ఇది 2006లో టీమ్ఇండియా పర్యటనలో నాకెంతో ఇష్టమైన లాహోర్ టెస్టు ఇన్నింగ్స్ తర్వాత తీసిన ఫోటో అనుకుంటా. ప్రత్యర్థి జట్ల బ్యాట్స్‌మెన్‌కు ఎప్పుడూ చెమటలు పట్టిస్తాడు షోయబ్. అయితే అది ఫ్లాట్ వికెట్ అవడంతో మా బాధను మరిచిపోవడానికి జోక్‌లతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని' అఫ్రిది ట్విట్ చేశాడు.
ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. యూనిస్ ఖాన్(199) తృటిలో ద్విశతకాన్ని కోల్పోగా.. మహ్మద్ యూసఫ్(173) కమ్రాన్ అక్మల్(102), షాహిద్ అఫ్రిది (103) శతకాలతో చెలరేగడంతో పాకిస్థాన్ ఏడు వికెట్లు కోల్పోయి 679 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కాగా.. అఫ్రిది కేవలం 80 బంతుల్లో 7పోర్లు 7 సిక్సర్ బాది శతకాన్ని బాదాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను భారత్ ఆరంభించింది.
డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(254), మిస్టర్ డిపెండబుల్, ది వాల్ రాహుల్ ద్రావిడ్(128 నాటౌట్) ఓపెనర్లుగా బరిలోకి దిగి పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. సెహ్వాగ్ బౌండరీలతో విరుచుకు పడగా.. ద్రావిడ్ తనదైన శైలిలో పరుగులు చేశాడు. వీరిద్దరు తొలి వికెట్ కు 410 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివరికి 254 పరుగులు చేసిన తరువాత సెహ్వాగ్ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం వన్ డౌన్‌లో హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్(0 నాటౌట్) బరిలోకి దిగాడు. కొద్దిసేపటికే భారి వర్షం కురియడంతో మ్యాచ్ డ్రా ముగిసింది. ఈ మ్యాచ్ లో రెండు జట్లలో కలిపి 12 మంది బ్యాటింగ్ చేయగా.. ఆరుగురు శతకాలు సాధించడం విశేషం.
ఈ పర్యటనలో టీమ్ ఇండియా మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడింది. రెండు డ్రా చేయగా.. ఓ దానిలో ఓటమి పాలైంది. దీంతో సిరీస్ ను 0-1తో కోల్పోయింది.