ధోని చెప్ప‌డంతో 2011 ఫైన‌ల్‌లో రెండో సారి టాస్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 May 2020 10:51 AM GMT
ధోని చెప్ప‌డంతో 2011 ఫైన‌ల్‌లో రెండో సారి టాస్

1983లో టీమ్ఇండియా తొలిసారి విశ్వ‌విజేత‌గా నిలిచింది. మ‌రోసారి ప్ర‌పంచ‌క‌ప్ అందుకోవ‌డానికి 28 ఏళ్లు ప‌ట్టింది. 2011 వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్‌లో 49వ ఓవ‌ర్ రెండో బంతికి అప్ప‌టి టీమ్ఇండియా కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోని సిక్స‌ర్‌ను భార‌త అభిమానులు ఎప్ప‌టికీ మ‌రిచిపోరు. ధోని విన్నింగ్ షాట్ కొట్ట‌గానే నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న యువ‌రాజ్ సింగ్ ప‌రుగున వ‌చ్చి ధోని ని హ‌త్తుకున్నాడు. ఆ సమ‌యంలో వికెట్ల ఉన్న అప్ప‌టి శ్రీలంక కెప్టెన్ కుమార సంగ‌క్క‌ర చిరున‌వ్వులు చిందిస్తున్న ఫోటో అప్ప‌ట్లో సోష‌ల్ మీడియా తెగ వైర‌ల్ అయ్యింది. ఓట‌మి బాధ‌ను దిగ‌మింగుకుంటూ.. చిరునవ్వుతో ఆ ఓటమిని స్వీకరించాడు సంగ‌క్క‌ర‌. లంక అభిమానులతో సహా, యావత్‌ క్రీడా ప్రపంచం సంగక్కర క్రీడా స్పూర్తికి అంద‌రూ మెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆ మ్యాచ్ తాలూకు జ్ఞాప‌కాల‌ను అభిమానుల‌తో పంచుకున్నాడు కుమార సంగ‌క్క‌ర‌.

భార‌త ఆఫ్ స్పిన్న‌ర్ ర‌వి చంద్ర‌న్ అశ్విన్‌తో క‌లిసి కుమార సంగ‌క్క‌ర ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించాడు. 2011 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ లో అస‌లు ఏం జ‌రిగిందో చెప్పాడు. ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆ రోజు రెండు సార్లు టాస్ వేసిన విష‌యాన్ని గుర్తు చేసుకున్నాడు. మొద‌టి సారి టాస్ వేసిన‌ప్పుడు తాను టెయిల్స్ అని చెప్పాన‌ని.. అయితే అభిమానుల కేరింత‌ల మ‌ధ్య అది ధోనికి విన‌బ‌డ‌లేద‌న్నాడు. దీంతో త‌ప్పని సరి ప‌రిస్థితుల్లో రెండో సారి టాస్ వేయాల్సి వ‌చ్చింద‌న్నాడు. ఆ మ్యాచ్‌లో ధోని టాస్ వేయ‌గానే టెయిల్స్ అని చెప్పా.. అప్పుడు అభిమానులు హంగామాలో ధోని ఆ విష‌యం విన‌ప‌డ‌లేదు.

దాంతో 'నువ్వు టెయిల్స్‌ అన్నావా' అని ధోనీ నన్నడిగాడు. అందుకు నేను జవాబిస్తూ.. 'కాదు టెయిల్స్‌ అన్నానని' చెప్పాను. దీనిబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్‌లో అభిమానుల హంగామా ఉందో. మా మ‌ధ్య చ‌ర్చ జ‌రుగుతుండ‌గా.. మ‌ధ్య‌లో మ్యాచ్ రిఫ‌రీ క‌ల‌గ‌జేసుకుని నేను టాస్ గెలిచిన‌ట్లు చెప్పారు. అయితే.. ధోని అందుకు ఒప్పుకోలేదు. మ‌రోసారి టాస్ వేయాల‌ని చెప్పాడు. దీంతో రెండో సారి టాస్ వేసామ‌ని.. మ‌ళ్లీ నేను టాస్ గెలవ‌డంతో బ్యాటింగ్ ఎంచుకున్నాన‌ని సంగ‌క్క‌ర చెప్పాడు. బహుశా రెండో సారి మేము టాస్ ఓడిపోయి ఉంటే.. టీమిండియా తొలుత బ్యాటింగ్‌ తీసుకునేది కావచ్చు. మేము లక్ష్యాన్ని ఛేదించేవాళ్లం కావచ్చు. ఎందుకంటే.. ఐదు, ఆరు​ స్థానాల వరకు మా బ్యాటింగ్‌ దుర్బేద్యంగా ఉంది. అప్పటికీ మేము బ్యాటింగ్‌లో పలు ప్రయోగాలు చేసి విజ‌య‌వంతం అయ్యామ‌ని అని సంగక్కర తెలిపాడు.

మేం మ్యాచ్ ఆడిన‌ప్పుడు ఎప్ప‌డైనా గెల‌వాల‌నే బ‌రిలోకి దిగుతాం. మా జ‌ట్టు గ‌ట్టిపోటినిస్తుంది. ఇక మ్యాచ్‌లో గెలిచినా ఓడినా కూడా ఎలా తీసుకోవాలో అనే దానిపై దృష్టిస్తారిస్తాం. ఆ చిరున‌వ్వు.. నిరాశ‌తో కూడిన ఎంతో బాధ‌ను క‌ప్పిపుచ్చింది. దాని వెనుక రెండు కోట్ల మంది లంకేయుల ఆశ‌లు ఉన్నాయి. 2007, 2011లో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ లు గెలిచే అవ‌కాశం రాగా.. 2009, 2012 లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లు గెలిచే అవ‌కాశాలు వ‌చ్చాయి. అయితే.. ఫ‌లితం ఏదైనా జీవిత‌మంటే ఇలాగే ఉంటుంద‌నే విష‌యాన్ని అర్థం చేసుకోవాల‌న్నాడు. అంద‌రికీ ప్ర‌తి విష‌యం అనుకూలంగా ఉండ‌దు. ఎలాంటి ఫ‌లితాన్ని అయినా స్వీక‌రించ‌డ‌మే ముఖ్యం. మా జ‌ట్టు గెలిచానా.. ఓడినా ఓకే విధంగా ఉంటుంద‌ని సంగ‌క్క‌ర చెప్పాడు.

ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. మ‌హేల జ‌య‌వ‌ర్ధ‌నే అజేయ శ‌త‌కంతో(103నాటౌట్; 88 బంతుల్లో 13పోర్లు) రాణించ‌డంతో నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల న‌ష్టానికి 274 ప‌రుగులు చేసింది. అనంత‌రం వ‌న్‌డౌన్ బ్యాట్స్ మెన్‌ గౌత‌మ్ గంభీర్‌(97; 122 బంతుల్లో 9పోర్లు), కెప్టెన్ ధోని (91 నాటౌట్; 79 బంతుల్లో 8పోర్లు, 2 సిక్స‌ర్లు) రాణించ‌డంతో 48.2 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 277 ప‌రుగులు చేసి రెండో సారి విశ్వ‌విజేత‌గా నిలిచింది. ధోని సిక్స‌ర్ తో మ్యాచ్‌ను ముగించాడు.

Next Story