ఇండియా కావాలనే ఓడిపోయిందని నేను అనలేదు..!

By సుభాష్  Published on  29 May 2020 10:28 AM GMT
ఇండియా కావాలనే ఓడిపోయిందని నేను అనలేదు..!

2019 వ‌ర‌ల్డ్ క‌ప్ లో లీగ్ మ్యాచ్ లో భారత్ ఇంగ్లాండ్ జ‌ట్టుతో ఓడిపోయింది. భారత్ గెలవాలన్న ప్రయత్నం కూడా చేయలేదని ఆ మ్యాచ్ ను చూసి చాలా మంది విమర్శించారు. పాకిస్థాన్ ను సెమీస్ కు రాకుండా చేయాలని భారత్ ఓడిపోయిందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు ఆరోపించారు. తాజాగా ఆ జట్టు ఆల్‌రౌండ‌ర్ బెన్‌స్టోక్స్ ధోని ఆట‌తీరుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. అస‌లు ధోనిలో గెల‌వాల‌న్న క‌సి క‌నిపించ‌లేద‌ని, సిక్స‌ర్లు కొట్టాల్సిన టైంలో సింగిల్స్ కు మ‌హీ ప్రాధాన్యం ఇచ్చాడ‌ని చెప్పాడు బెన్ స్టోక్స్‌. ధోని ఆట‌లో అస‌లు తీవ్ర‌త క‌నిపించ‌లేద‌ని, కెప్టెన్ విరాట్ కోహ్లీ, హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ భాగ‌స్వామ్యం విస్మ‌య‌ప‌రిచింద‌న్నాడు స్టోక్స్. ఆ మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. ‘భారత్ గెలవాలంటే 11 ఓవర్లలో 112 పరుగులు చేయాల్సిన తరుణంలో క్రీజులోకి వ‌చ్చాడు. ధోని ఎడాపెడా బౌండ‌రీలు బాదుతాడ‌ని అనుకున్నా.. అయితే ధోనీ బ్యాటింగ్ తనకు వింతగా అనిపించిందని’ స్టోక్స్ పేర్కొన్నాడు.

బెన్ స్టోక్స్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయింది. సోషల్ మీడియాలో నెటిజన్లు బెన్ స్టోక్స్ ను ట్యాగ్ చేస్తూ వస్తున్నారు. బెన్ స్టోక్స్ తన పుస్తకంలో 'భారత్ కావాలనే తమతో మ్యాచ్ లో ఓడిపోయిందని అన్నారని' పాకిస్థాన్ టెస్ట్ క్రికెటర్ సికందర్ భక్త్ ఓ వీడియోను అప్లోడ్ చేసాడు. పాకిస్థాన్ కు చెందిన న్యూస్ రూమ్ డిబేట్ లో మాట్లాడుతూ.. ఏదైనా టోర్నమెంట్ లో పాకిస్థాన్ ముందుకు వెళ్ళకూడదు అని అనుకుంటే భారత్ తప్పకుండా ఓడిపోతుందని తాము ముందే చెప్పామని.. అనుకున్నట్లే ఓడిపోయిందని సికందర్ చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని తాము ముందే ఊహించామని అన్నారు. కానీ భారత్ కావాలనే ఓడిపోయిందని బెన్ స్టోక్స్ ఎక్కడ చెప్పారో చూపించాలని స్పోర్ట్స్ అనలిస్ట్ సొహైబ్ ఖాన్ ట్విట్టర్ లో కోరారు.

దీనికి బెన్ స్టోక్స్ డైరెక్ట్ గా స్పందించాడు. 'భారత్ కావాలనే ఓడిపోయిందని తాను అన్న వ్యాఖ్యలు ఎక్కడ కూడా కనపడవని.. ఎందుకంటే ఆ మాటను నేను అనలేదని' స్పష్టం చేశాడు బెన్ స్టోక్స్. వీటిని మాటలను వక్రీకరించడం అని అంటారని బెన్ స్టోక్స్ తెలిపాడు.

Next Story