ఆస్ట్రేలియాలో భార‌త‌ సుధీర్ఘ ప‌ర్య‌ట‌న‌కు షెడ్యూల్ విడుద‌ల‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 May 2020 5:47 AM GMT
ఆస్ట్రేలియాలో భార‌త‌ సుధీర్ఘ ప‌ర్య‌ట‌న‌కు షెడ్యూల్ విడుద‌ల‌

క‌రోనా వైర‌స్‌ కార‌ణంగా క్రీడారంగం కుదేలైంది. ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా చాలా టోర్నీలు వాయిదా ప‌డ‌గా.. మ‌రికొన్ని ర‌ద్దు అయ్యాయి. ఇప్ప‌ట్లో క్రీడ‌లు మొద‌ల‌వుతాయా అన్న సందేహాల‌కు తెర దించుతూ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆరు నెల‌ల‌కు సంబంధించిన ప్ర‌ణాళిక‌ను ఆవిష్క‌రించింది. దీంతో.. ఆస్ట్రేలియాలో టీమ్ఇండియా ప‌ర్య‌ట‌న‌పై నెల‌కొన్న సందిగ్ధ‌త‌కు తెర‌ప‌డిన‌ట్లు అయ్యింది.

ఈ ప‌ర్య‌ట‌న‌లో టీమ్ఇండియా ఆస్ట్రేలియాతో మూడు టీ20లు, మూడు వ‌న్డేలు, నాలుగు టెస్టుల్లో త‌ల‌ప‌డ‌నుంది. ఈ సిరీస్‌ల‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా గురువారం ప్ర‌క‌టించింది.

కోహ్లీసేన మొద‌ట టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డ‌నుంది. అక్టోబ‌ర్ 11న బ్రిస్బేన్ వేదిక‌గా తొలి టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. రెండో టీ20 అక్టోబర్ 14న కాన్‌బెర్రాలో, మూడో టీ20 అక్టోబర్ 17న‌ అడిలైడ్‌లో జరుగనున్నాయి.

ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్ర‌కారం ఆసీస్‌తో టీ20 సిరీస్ ముగిసిన త‌రువాత టీ20 ప్ర‌పంచ‌కప్‌లో భార‌త్ పాల్గొన‌నుంది. ఆస్ట్రేలియానే టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు అతిథ్య‌మివ్వ‌నుంది. అయితే.. ప్ర‌పంచ‌క‌ప్ గురించి త‌న ప్ర‌ణాళిక‌లో క్రికెట్ ఆస్ట్రేలియా క‌నీసం ప్ర‌స్తావించ‌లేదు. దీంతో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ వాయిదా ప‌డే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ టీ20 ప్ర‌పంచక‌ప్ వాయిదా ప‌డితే.. భార‌త జ‌ట్టు స్వ‌దేశానికి వ‌చ్చి ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్)లో పాల్గొనే అవ‌కాశం ఉంది.

టీ20 సిరీస్ త‌రువాత టెస్టు సిరీస్ మొద‌లు కానుంది. మొద‌టి టెస్టు డిసెంబర్‌ 3న బ్రిస్బేన్‌ వేదికగా ప్రారంభం కానుంది. రెండో టెస్టు అడిలైడ్ వేదిక‌గా డిసెంబర్ 11న జ‌రగనుంది. ఇది డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌. ఇక మూడో టెస్ట్ మెల్‌బోర్న్ వేదిక‌గా డిసెంబ‌ర్ 26న ప్రారంభం కానుండ‌గా.. నాలుగో టెస్టు సిడ్నీ వేదిక‌గా జ‌న‌వ‌రి 3న జ‌ర‌గ‌నుంది.

ఆత‌రువాత వ‌న్డే సిరీస్ ఆరంభం కానుంది. జ‌న‌వ‌రి 12న పెర్త్ వేదిక‌గా తొలివ‌న్డే జ‌ర‌గ‌నుండ‌గా.. మెల్‌బోర్న్ వేదిక‌గా 15న రెండో వ‌న్డే, సిడ్నీ వేదిక‌గా 17న ఆఖ‌రి వ‌న్డే జ‌ర‌నుంది. దీంతో సుధీర్ఘ ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న పూర్తి కానుంది. ఒక వేళ టీమ్ఇండియా ప‌ర్య‌ట‌న ర‌ద్దు అయితే.. క్రికెట్ ఆస్ట్రేలియా భారీ న‌ష్ట‌పోతుంద‌ని ఇప్ప‌టికే ఆదేశ టెస్టు కెప్టెన్ టీమ్ ఫైన్‌తో పాటు ప‌లువురు మాజీలు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

భార‌త్ - ఆస్ట్రేలియా షెడ్యూల్ వివ‌రాలు..

టీ20 సిరీస్ మ్యాచ్‌ల వివ‌రాలు..

మ్యాచ్ ‌తేదీ వేదిక
తొలి టీ20అక్టోబ‌ర్ 11బ్రిస్బేన్
రెండో టీ20అక్టోబర్ 14కాన్‌బెర్రా
మూడో టీ20అక్టోబర్ 17అడిలైడ్‌

టెస్టు సిరీస్ మ్యాచ్‌ల వివ‌రాలు..

మ్యాచ్ తేదీ వేదిక
మొద‌టి టెస్టుడిసెంబర్ (3 -7)బ్రిస్బేన్‌
రెండో టెస్టు(డే &అండ్ నైట్‌)డిసెంబర్ (11-15)అడిలైడ్
మూడో టెస్ట్డిసెంబ‌ర్ (26-30)మెల్‌బోర్న్
నాలుగో టెస్టుజ‌న‌వ‌రి (3-7)సిడ్నీ

వ‌న్డే సిరీస్ మ్యాచ్‌ల వివ‌రాలు..

మ్యాచ్ తేదీ వేదిక
తొలి వ‌న్డే జ‌న‌వ‌రి 12పెర్త్
రెండో వ‌న్డేజ‌న‌వ‌రి 15మెల్‌బోర్న్
మూడో వ‌న్డే జ‌న‌వ‌రి 17సిడ్నీ

Next Story