ముంబై: దేశంలో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరగడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అహర్నిశలు కృషి చేస్తున్నాయి. రాజకీయ నాయకుల నుంచి సినిమా ప్రముఖుల దాకా చాలా మంది కరోనా వైరస్‌పై పోరాడేందుకు ప్రభుత్వాలకు విరాళాలు అందజేస్తున్నారు.

తాజాగా బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ మహమ్మారి కరోనాపై పోరాటానికి భారీ విరాళం ప్రకటించారు. కరోనా నియంత్రణ చర్యల కోసం రూ.25 కోట్లు విరాళం ప్రకటించి తన వంతు సాయం చేశాడు. ఈ మొత్తాన్ని ప్రధాని సహాయ నిధికి అందజేస్తానని తెలిపారు.

టాటా ట్రస్ట్‌, టాటా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ తరఫున రతన్ టాటా.. కరోనాపై పోరాడేందుకు రూ.500 కోట్లను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాము కూడా సిద్ధమే.. దేశ అవసరాల కోసం టాటా గ్రూప్‌ ముందుంటుందని ఆయన ట్వీట్‌ చేశారు. కరోనా నిర్దారణ కిట్స్‌, శ్వాస సంబంధిత పరికరాలతో పాటు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తామని ఆయన తెలిపారు.

భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 909కి చేరింది. ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.