రానున్న రోజుల్లో ఉద్యోగాలన్నీ బ్లాక్ చైన్ రంగంలోనే ...

By Newsmeter.Network  Published on  10 Dec 2019 6:36 AM GMT
రానున్న రోజుల్లో ఉద్యోగాలన్నీ బ్లాక్ చైన్ రంగంలోనే ...

బ్లాక్ చైన్ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, రానున్న రోజుల్లో ఉపాధి పరంగా బ్లాక్ చైన్, కృత్రిమ మేధో రంగాలదే మన దేశంలో పై చేయి అని ఉపాధి అవకాశాల వెబ్ సైట్ లింక్డ్ ఇన్ తన తాజా సర్వేలో తెలిపింది.

గతేడాది టాప్ టెన్ లో లేని బ్లాక్ చైన్ డెవలప్ మెంట్ ఈ ఏడాది తొలి స్థానానికి చేరుకోవడం ఈ రంగంలో ఉపాధి అవకాశాలు ఎంత మేరకు పెరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. తాజా నివేదికలో టెక్ ఆధారిత ఉద్యోగాలదే పైచేయి. అయితే డిజిటల్ మార్కెటింగ్, లీడ్ జెనరేషన్ స్పెషలిస్ట్ వంటివి కూడా మంచి ఉపాధి అవకాశాలను అందచేస్తున్నాయి.

ఈ రంగాల్లో ఇప్పటికీ స్థానికంగా తగిన అర్హతలున్న అభ్యర్థులు లేకపోయినా, ఏడాదికేడాది ఉపాధి అవకాశాలు, ఈ అంశాలపై అర్హతలు సాధిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని లింక్డ్ ఇన్ నివేదిక తెలియచేస్తోంది. టెక్నాలజీ రంగంలో ఉత్పాదనల తయారీలో అవసరమైన బ్లాక్ చైన్ సిస్టమ్స్ ను డెవలపర్స్ తయారు చేస్తారు. ఇవి ఉత్పాదనలో పాలుపంచుకుంటున్న అందరికీ డేటాబేస్ ను అందచేస్తాయి. అంతర్జాతీయ చెల్లింపులను సులభతరం చేస్తూ ఉత్పాదకులకు బిలియన్ల డాలర్లు ఆదా చేయడంలో బ్లాక్ చైన్స్ ఎంతో ఉపకరిస్తాయి. బ్లాక్ చైన్ డెవలపర్ కావాలంటే హైపర్ లెడ్జర్, నోడ్ జే ఎస్, స్మార్ట్ కాంట్రాక్ట్ వంటి సాఫ్ట్వేర్లు వచ్చి ఉండాలి. ఇలాంటి డెవలపర్స్ కు బెంగుళూరు, హైదరాబాద్, ఢిల్లీలలోని ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులు, హాస్పిటల్, వైద్య సేవా రంగాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. మన దేశం బ్లాక్ చైన్ డెవలప్ మెంట్ లో ప్రపంచంలోనే అగ్రశ్రేణి దేశాల సరసన ఉందని ప్రపంచ మేధో హక్కుల సంస్థ గతేడాది తన నివేదికలో తెలియచేసింది. చైనా 790 పాయింట్లతో, అమెరికా 762 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉండగా, భారత్ 67 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. లింక్డ్ ఇన్ టాలెంట్ అండ్ లెర్నింగ్ సొల్యూషన్స్ హెడ్ రుచి ఆనంద్ భారత పరిశ్రమలు, కంపెనీలు బ్లాక్ చైన్ లో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు.

ఆటోమేషన్ పెరిగే కొద్దీ కృత్రిమ మేధస్సు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ఆమె చెప్పారు. మెషీన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ లను నేర్పే వారు కూడా పెద్ద సంఖ్యలో అవసరమౌతారని ఆమె చెప్పారు. మూడో స్థానంలో జావా స్క్రిప్ట్ డెవలపర్స్, నాలుగో స్థానంలో రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ కన్సల్టెంట్లు ఉన్నారు. ఆ తరువాతి స్థానాల్లో బ్యాకెండ్ డెవరపర్స్, గ్రోత్ మేనేజర్లు, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్లు, కస్టమర్ సక్సెస్ స్పెషలిస్టులు, ఫుల్ స్టాక్ ఇంజనీర్లు, రోబోటిక్ ఇంజనీర్లు, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్టులు, పైథాన్ డెవలపర్స్, డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్టులు, ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్లు, లీడ్ జెనరేషన్ ఇంజనీర్లు ఉన్నారు.

Next Story