బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. తొమ్మిది మంది మృతి
By తోట వంశీ కుమార్ Published on 4 Sept 2020 1:28 PM ISTతమిళనాడులోని దారుణం చోటుచేసుకుంది. కడలూరులోని ఓ టపాసుల కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో యజమానితో పాటు అందులో పని చేస్తున్న ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలో ఐదుగురు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందినట్లు స్థానిక అధికారులు చెప్పారు. పేలుడు సంభవించిన అనంతరం గ్రామ ప్రజలు అక్కడకు చేరుకున్నారు. ఘటన స్థలంలో మృతదేహాలు చెల్లా చెదురుగా పడివుండటం కలచివేసింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం పై ఆరా తీశారు. కడలూరు ఎస్పీ శ్రీ అభినవ్ మాట్లాడుతూ.. పేలుడు సంభవించిన కర్మాగారానికి లైసెన్స్ ఉందని తెలిపారు. ఫ్యాక్టరీలో నాటు బాంబులు తయారు చేయడం వల్ల ప్రమాదం సంబవించిందా అన్న దిశగా విచారణ చేపడుతున్నామని అన్నారు. ఎక్కువ రసాయనాలు వాడటం వల్లనే ప్రమాదం జరిగి ఉంటుందని భావించారు.