బ్లాక్‌ పాంథర్‌ నటుడు చాడ్విక్ బోస్మాన్ కన్నుమూత

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Aug 2020 6:17 AM GMT
బ్లాక్‌ పాంథర్‌ నటుడు చాడ్విక్ బోస్మాన్ కన్నుమూత

హాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, బ్లాక్‌ పాంథర్‌ స్టార్‌ చాడ్విక్ బోస్మాన్ క్యాన్సర్‌ కారణంగా కన్నుమూశారు. ఆయన వయసు 43 సంవత్సరాలు. చాడ్విక్ లాస్‌ ఏంజెలెస్‌లోని తన ఇంట్లోనే మరణించినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. చాడ్విక్ 2016 నుంచి స్టేజ్ 3 పేగు కేన్సర్‌తో బాధపడుతున్నాడు.

2016లో వచ్చిన ‘కెప్టెన్ అమెరికా సివిల్‌వార్’ సినిమాలో మార్వెల్ సూపర్ హీరో బ్లాక్ పాంథ‌ర్ పాత్ర‌ను పోషించిన చాడ్విక్ అభిమానులను అలరించారు. ఇదే పాత్ర‌ను ‘ఎవెంజ‌ర్స్ ది ఎండ్‌గేమ్‌’లోనూ పోషించాడు. 2018లో వచ్చిన బ్లాక్ పాంథర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్ల డాలర్లకు పైగా వసూలు చేసింది 2016 నుంచి కేన్సర్‌కు చికిత్స పొందుతూనే పలు సినిమాల్లో చాడ్విక్ నటించాడు. ఈ ఏడాది ప్రారంభంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన డా 5 బ్లడ్స్‌లో చాడ్విక్‌ చివరిసారిగా కనిపించాడు. బేస్‌బాల్ దిగ్గజం జాకీ రాబిన్సన్, ప్రముఖ సంగీతకారుడు జేమ్స్ బ్రౌన్ జీవిత కథలతో రూపొందించిన చిత్రాల్లో వారి పాత్రలు పోషించి ప్రశంసలు అందుకున్నారు బోస్‌మన్.

చాడ్విక్ బోస్మాన్ దక్షిణ కెరొలినలోని అండర్సన్ లో పుట్టి పెరిగాడు. 2003 లో తన మొదటి టెలివిజన్ పాత్రను థర్డ్ వాచ్ ఎపిసోడ్ లో నటించాడు. తరువాత అతను ది కిల్ హోల్- 42- డ్రాఫ్ట్ డే- గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్- మెసేజ్ వంటి చిత్రాలలో నటించాడు. ప్రస్తుతం అయన బ్లాక్ పాంథ‌ర్ సినిమా సీక్వెల్ కోసం రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో అయన మరణవార్త అందరిని కలిచివేసింది.Next Story