హైదరాబాద్: చంద్రుడి మీదకు కాలు పెట్టే రోజులు వచ్చినా ప్రజల మనసుల్లోంచి మూఢ నమ్మకాలు మాత్రం పోవడంలేదు. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఓ యువకుడ్ని సజీవ దహనం చేశారు ఆద్రాన్ పల్లి గ్రామస్తులు. ఈ ఘటన శామీర్ పేట  పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆద్రాన్ పల్లి గ్రామానికి చెందిన గ్యార లక్ష్మి(45) అనే మహిళ తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందింది. అయితే.. అదే గ్రామానికి చెందిన బోయిని ఆంజనేయులు(24) అనే యువకుడు శ్మశానంలో లక్ష్మి కాష్టం వద్ద కూర్చొని మంత్రాలు చదువుతున్నాడనే వార్తలు గుప్పుమన్నాయి.  దీంతో  గుర్తు తెలియని వ్యక్తులు ఆంజనేయులును గొడ్డలితో నరికి అదే కాష్టంలోకి నెట్టారనీ,  ఆ యువకుడు మంటల్లో పడి కాలిపోయాడని గ్రామస్థులు చెప్తున్నారు. ఈ వార్త ఆనోటా.. ఈనోటా దావానంలా వ్యాపించి పోలీసులకు తెలిసింది. విషయం తెలుసుకున్న వెంటనే శ్మశాన వాటికకు చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాష్టంలో కాలిన రెండు శవాలను పోలీసులు  గుర్తించినట్లు సమాచారం.అయితే…ఈ  ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.