23న బ్లాక్‌ డే

By సుభాష్
Published on : 21 April 2020 3:47 PM IST

23న బ్లాక్‌ డే

వైద్యులే దేవుళ్లంటారు. ప్రాణాలు పోతుంటే బతికించేది వైద్యులే. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే వైద్యులు చేస్తున్న సేవ అంతా ఇంతా కాదు. వైద్య సేవలు అందించడంలో డాక్టర్లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. అలాంటి వైద్యులపై దాడులు పెరిగిపోతున్నాయి. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా రోగులకు చికిత్సలు చేస్తున్న వైద్యులపై దాడులు జరగడం శోచనీయం.

దాడులకు నిరసనగా ఏప్రిల్‌ 23న బ్లాక్‌డే పాటించాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐఎంఏ ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా కట్టడిలో కుటుంబాలకు దూరంగా ఉంటూ పని చేస్తున్న వైద్యులపై దాడులు పెరిగిపోతున్నాయని, ఆ రోజు అంతా వైద్యులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ రాజన్‌ శర్మ, గౌరవ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్వీ అశోకన్‌ తెలిపారు. అలాగే ఈ దాడులకు వ్యతిరేకంగా ఈనెల 22న రాత్రి 9 గంటలకు ఆస్పత్రులలో క్యాండిల్స్‌ వెలిగించి నిరసన తెలపాలని వారు వైద్యులను కోరారు.



Next Story