నలుపు తెలుపు.. తోడుకు పిలుపు..!
By మధుసూదనరావు రామదుర్గం Published on 2 Aug 2020 1:24 PM ISTసోషల్ మీడియా అంటే కేవలం పొద్దుపోని కబుర్లు, ముచ్చట్లు అనే భావన క్రమంగా పోతోంది. ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లను సెలిబ్రిటీలు మొదలు సామాన్యులు దాకా అందరూ స్వేచ్ఛగా తమ అభీష్టానికి అనుగుణంగా వాడుతున్నారు. కొందరు తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోడానికైతే మరికొందరు తమకు ఇష్టమైన వారిలో ఆత్మవిశ్వాసాన్ని కల్పించడానికి ఈ మాధ్యమాన్ని సమర్థంగా వినియోగించుకుంటున్నారు. అందుకే సమకాలీన సామాజిక సమస్యలకు అద్దం పట్టేలా పోస్టింగ్‌లు ఉంటున్నాయి. సోషల్ మీడియా యాక్టివిస్టులు తమ అభిప్రాయాలను భావాలనే కాదు నిరసనలను వ్యతిరేకతను తెరలపడానికి ప్రతీకాత్మక చిత్రాలను(సింబాలిక్ ఫొటో) పోస్టు చేస్తున్నారు. అసహాయలకు అండగా కావచ్చు, అన్యాయాలపై ఆగ్రహం కావచ్చు, అణ గారిని వారికి చేయూతగా కావచ్చు.. పోస్టులుంటున్నాయి. వీటిలో కావల్సినంత క్రియేటివిటీ కనెక్టివిటీ కనిపిస్తుంటుంది.
తాజాగా ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అంటూ కొందరు సుప్రసిద్ధ మహిళలు తమ బ్లాక్ అండ్ వైట్ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ తీరు కొనసాగుతోంది. అమెరికన్ ఫిల్మ్ డైరెక్టర్ అవా తన ఫొటో పోస్టు చేస్తూ ఉద్యమానికి మద్దతు పలికింది. ప్రముఖ మోడల్ కిండీ క్రాఫోర్డ్ కూడా ఈ స్రవంతిలో కలిసింది. తన ఫోటోను ఇన్‌స్టాలో పెడుతూ ‘ఒకరినొకరు సమర్థించుకోడానికి బలపరచుకోడానికి ఇదో మంచి ప్రయత్నం ఐ లవ్ ఇట్’ అంటూ రాసింది.
మన దేశంలో అనుష్కశర్మ, ప్రియాంకా గాంధీ ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. బాలీవుడ్‌లో ఈ నయాట్రెండ్‌ను ఫాలోఅవుతున్నారు. బాలీవుడ్ నటి అనుష్కశర్మ తన ఫోటోతోపాటు సుదీర్ఘ వ్యాఖ్య జతపరిచింది. మనలో వ్యక్తిత్వం ఉన్నా, తెలివితేటలున్నా, స్వతంత్ర భావాలున్నా.. అనునిత్యం సాధింపులు వేధింపులు దాడులు హింసలను మౌనంగా భరిస్తూ సహిస్తూ జీవిస్తున్నాం. ఈ హింస ఎంత నరకప్రాయమో మనకే బాగా తెలుసు. ఒకరికొకరు బాసటగా నిలిచి కుప్పకూలకుండా పరిరక్షించుకోవడం అత్యవసరం. అందుకే ఈ ఉద్యమాన్ని మనస్పూర్తిగా స్వాగతిస్తున్నానని రాశారు.
కేవలం సినీ తారలే కాకుండా పారిశ్రామిక వేత్తలు మేముకూడా అంటూ ముందుకొస్తున్నారు. అనన్యా పాండే, టీనా అంబానీ, కరిష్మాకపూర్, మాధురీ దీక్షిత్ తదితరులు బ్లాక్ అండ్ వైట్ ఫొటోలను పెట్టి సవాలును స్వీకరిస్తున్నాం అని రాస్తున్నారు. వీరే కాకుండా ఈ ట్రెండ్‌ను అనుసరిస్తూ ఫేస్‌బుక్‌లో విద్యార్థినులు, ఉద్యోగులు, గృహిణులు కూడా నలుపు తెలుపు చిత్రాలను పెడుతున్నారు. అయితే చాలా మంది కేవలం ఫోటోలు పోస్టు చేయడానికే పరిమితమవుతున్నారు. ఫేస్‌బుక్‌లో వారి ఫాలోయర్లు.. ఎందుకీ ఫొటో పెట్టారు అని అడిగితే ఏమో తెలియదు అందరూ పెడుతున్నారు నేను కూడా అంటున్నారు. కానీ ఈ సింబాలిక్‌పోస్టింగ్‌ల వెనక ఓ అంతరార్థం దాగుంది.
ఇంతకూ ఏంటీ ఛాలెంజి అంటే ఒకరికొకరు తోడుగా ఉందాం..కలిసి పోరాడుదాం,మహిళకు మహిళ తోడుగా.. అని దీన అని అర్థం. ఇదో సంకేతాత్మక ఉద్యమం. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో 53 లక్షలకు పైగా సవాలును స్వీకరిస్తున్నట్టు ఫొటోలు పోస్టయ్యాయి. మహిళలు తమ నలుపుతెలుపు చిత్రాలను పోస్టు చేస్తూ మరొకరిని నామినేట్ చేయాలి. ఈ నయా ట్రెండ్ వారం కిందట బ్రెజిలియన్ జర్నలిస్టు అనా పోలా తన ఫోటోను పోస్ట్ చేయడంతో మొదలైనట్టు తెలుస్తోంది. క్రమంగా ఇది అంతటా వ్యాపించింది.
అయితే కొందరు దీన్నిఅంగీకరించడం లేదు. ఈ నయా ట్రెండె మొదట టర్కీలో మొదలైందంటున్నారు. ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పెట్టిన పోస్టులో ‘టర్కీలో మహిళలపై కొనసాగుతున్న హింస దౌర్జన్యాలు అనేకం. మీడియా బాధితుల రక్తగాయాలను నలుపుతెలుపులో చూపిస్తుంటుంది. అయితే ఒక విషయం రేపు ఆ ఫోటో మనదే కావచ్చు. అందుకే మనం మేల్కోవాలి అంటూ మహిళలు సంఘటితంగా స్పందిస్తూ తమ ఫొటోలోను పోస్ట్ చేయడ చూసి ఆశ్యర్యమేసింది. ఇదో ప్రభావాత్మకమైన మహిళా ఉద్యమం’అంటూ రాశారు.
హలీవుడ్‌లో ఈ ఉద్యమానికి ప్రాధాన్యం కల్పించింది నటి సూజన్. గత మార్చి 13న బ్రియానా టేలర్ అనే ఆఫ్రికన్ యువతిని పోలీసులు కాల్చి చంపినందుకు నిరసనగా సూజన్ తన నలుపుతెలుపు ఫొటో పోస్ట్ చేసిందని తెలుస్తోంది. కానీ కొందరు విమర్శకులు ఈ ఉద్యమాన్ని విమర్శిస్తున్నారు. లక్ష్యం చాలా సాధారణీకరణగా ఉంది (జనరలైజ్) . ఇలాంటివి భావావేశాన్ని ప్రేరేపిస్తాయి గానీ లక్ష్యం దిశగా సాగడం కష్టమని అంటున్నారు. టర్కీలో కొందరు మహిళలు ఎందుకిలా చేయలో తెలీకుండా ఫొటోలు పోస్ట్ చేసి పిలుపునిచ్చారని కాసింత ఘాటుగానే చెబుతున్నారు.
అయితే ఎవరు ఈట్రెండ్‌ను ప్రారంభించారు? వారికి అర్థం తెలుసా అన్నది ముఖ్యం కాదు అందులో గాఢతను అర్థం చేసుకోవాలి. ఇలాంటి ఉద్యమాలను చూనిసపుడల్లా సోషల్ మీడియా వల్ల జనాలు చెడిపోతున్నారన్న సగటు విమర్శకు అర్థం లేదనిపిస్తోంది. ఈ మాధ్యమం అత్యంత స్వేచ్ఛతో కూడి ఉంటుంది. ఎవరు ఎలా అర్థం చేసుకుంటారో అలా.. ఎవరు ఎలా వాడుకుంటారో అలా మారిపోతుంటుంది. కాదంటారా..?