కొన్నిసార్లు అదే పనిగా విరుచుకుపడాల్సిన అవసరమే ఉండదు. ఘాటు వ్యాఖ్యలు చేయనక్కర్లేదు కూడా. సింఫుల్ గా అనే మాటలే.. ఎక్కడ తగలాలో అక్కడ తగులుతాయి. మామూలు సమయాల్లో రాజకీయ ప్రత్యర్థులు చేసే వ్యాఖ్యలకు కౌంటర్లు ఇవ్వటం మామూలే. కానీ.. అలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండేలా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలాన్ని రేపుతున్నాయి.
సచివాలయం కూల్చి వేత నేపథ్యంలో అక్కడే ఉన్న మసీదు.. దేవాలయాన్ని తీసివేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్న మురళీధర్ రావు మాట్లాడుతూ.. సచివాలయాన్ని కూలగొట్టే క్రమంలో నల్లపోచమ్మ గుడిని కూలగొట్టారని.. అలా చేశారంటే కేసీఆర్ ప్రభుత్వానికి దినం దగ్గర పడిందంటూ గులాబీ బ్యాచ్ గుండెలు అదిరేలా సెంటిమెంట్ విమర్శను చేశారు.

గుడిని కావాలనే కూలగట్టి.. పొరపాటున కూలిపోయిందని అబద్ధాలు చెబుతున్నారన్నారు. నల్గొండ.. మహబూబ్ నగర్ జిల్లాల వర్చువల్ మీటింగ్ సందర్భంగా మురళీధర్ రావు నోటి వెంట ఈ ఘాటు వ్యాఖ్యలు వచ్చాయి. నల్ల పోచమ్మ గుడి కూలిపోయిందంటే.. టీఆర్ఎస్ సర్కారు కూడా కూలిపోబోతోందన్నారు.

అసలైన హిందువును తానేనని చెప్పుకనే కేసీఆర్.. తాజాగా పాజిటివ్ సంఖ్యను నియమంత్రించే విషయంలో కేసీఆర్ సర్కారు దారుణంగా ఫెయిల్ అయినట్లుగా మండిపడ్డారు. కరోనా బాధితులకు సరైన సౌకర్యాల్ని కూడా కల్పించలేకపోతున్నట్లుగా విరుచుకుపడ్డారు. ప్రభుత్వం చేసిన పాపాలతోనే పెద్ద ఎత్తున రోగులు ఆక్సిజన్ బెడ్లు.. ఐసీయూల్లో బెడ్లు దొరక్క మరణిస్తున్నారన్నారు. మురళీధర్ రావు మండిపాటుకు టీఆర్ఎస్ నేతల నుంచి స్పందన తక్కువగా ఉండటం గమనార్హం.

 

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.