యూపీ బీజేపీ నేత గజరాజ్‌ రానా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. త్వరలో అయోధ్య వివాదంపై కోర్టు తీర్పు వెలువ‌డ‌నున్న‌ నేపథ్యంలో ఈ వార్త‌లు సంచ‌ల‌నం రేపుతున్నాయి. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. దీపావళి, దంతెరాస్‌ పండుగలకు బంగారం, వెండికి బదులు దేశంలోని హిందువులంతా ఇనుముతో చేసిన కత్తులు కొనాలని ఆయన సూచించారు. కోర్టు తీర్పు హిందువులకు అనుకూలంగా వస్తుందని.. తీర్పు ఎలాంటిదైనా ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తీవ్ర మార్పులొస్తాయని.. ముందు జాగ్రత్తగా ఆత్మ రక్షణ కోసం ఆయుధాలు అవసరమని గజరాజ్ వ్యాఖ్యానించారు. హిందూ పురాణాల్లో కూడా దేవుళ్లు, దేవతలు తగిన సందర్భాల్లో ఆయుధాలు ధరించి ధర్మరక్షణకు పాటుపడ్డారని.. ఆకోవలోనే తన వ్యాఖ్యలను అర్థం చేసుకోవాలి అని.. వేరే అభిప్రాయాలను ఆపాదించొద్దని గ‌జ‌రాజ్ వి​జ్ఞప్తి చేశారు.

గ‌జ‌రాజ్ రానా వ్యాఖ్యలపై యూపీ బీజేపీ అధికార ప్రతినిధి చంద్రమోహన్‌ స్పందించారు. గజరాజ్‌ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనవని.. దాంతో పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే.. రానా గతంలోనూ.. ముస్లీంల‌ పవిత్ర ప్రార్థ‌న స్థ‌లం మక్కాలో శివలింగం ఉందని, ఒక‌ప్పుడు అక్కడ హిందువులు నివ‌సించేవార‌ని వ్యాఖ్యానించారు.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.