కార్పొరేట్ కంపెనీ(వైసీపీ) పాలనలో ప్రజలు నలిగిపోతున్నారు..
By అంజి Published on 12 Feb 2020 12:20 PM IST
గుంటూరు: 2014, 2019లో అధికారంలోకి వచ్చిన కార్పొరేట్ కంపెనీల పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. టీడీపీని, వైసీపీ ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని యధేచ్చగా దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రాజధాని విశాఖకు రావడంపై ఆ ప్రాంత ప్రజలు భయపడుతున్నారని కన్నా అన్నారు. పేదల రక్తం పిండి వైసీపీ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని ఆయన విమర్శించారు. ఆర్టీసీ, విద్యుత్, పెట్రోల్ చార్జీలు పెంచి ప్రజల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. అమరావతిలోనే రాజధాని ఉండేలా పోరాడతామని కన్నా వ్యాఖ్యనించారు. విశాఖ రాజధానిపై ఉత్తరాంధ్ర ప్రజలు సానుకూలంగా లేరన్నారు.
బుధవారం ఉదయం కన్నా లక్ష్మీనారాయణ అమరావతి ప్రాంత రైతులను కలిశారు. అమరావతిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్థిరాస్తి వ్యాపారం చేశారని.. ఇప్పుడు ఇక్కడ దోచుకునేందుకు ఏమీ లేకపోవడంతో సీఎం జగన్.. రాజధానిని విశాఖ తరలిస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. జగన్ సర్కార్ విధానాలతో ఏపీ రావణకాష్టంలా మారిందన్నారు. తమ పాలనే అవినీతి పాలన అన్నట్టుగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కన్నా విమర్శించారు. అమరావతే రాజధానిగా ఉండాలని విజయనగరం ప్రజలు కూడా కోరుకుంటున్నారని కన్నా చెప్పుకొచ్చారు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వం పని చేయడం లేదని, ప్రజలకు కొన్ని తాయిలాలు ఇచ్చి మభ్యపెడుతున్నారని ఆయన మండిపడ్డారు.