దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల్లో వెనకబడ్డ బీజేపీ..!
By న్యూస్‌మీటర్ తెలుగు
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతో పాటు 16 రాష్ట్రాల్లో 51 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్-11, గుజరాత్-6, బిహార్-5, కేరళ-5, పంజాబ్-4, అసోం-4, సిక్కిం-3 స్థానాలకు బై ఎలక్షన్స్ నిర్వహించారు. హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడుల్లో రెండేసి సీట్లు, అరుణా చల్, మేఘాలయ, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, పుదుచ్చేరిలో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. మహారాష్ట్ర, బిహార్‌లలో ఒక్కో స్థానానికి ఎన్నిక జరిగింది.
ఉప ఎన్నికల్లో బీజేపీకి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. యూపీలో 11 సీట్లకు గాను బీజేపీ 7 సీట్లలో విజయం సాధించింది. ఆ పార్టీ మిత్రపక్షం అప్నాదళ్ ఒక సీటు గెలుపొందింది. ఎస్పీ-2, బీఎస్పీ-1, కాంగ్రెస్-1 ఒక సీటు గెలుచుకున్నాయి. గుజరాత్‌లో 6 సీట్లకు గాను బీజేపీ, కాంగ్రెస్‌లు చెరి 3 స్థానాలు గెలుపొందాయి. బిహార్‌లో బీజేపీ కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 5 సీట్లకు ఎన్నికలు జరిగితే ఒక్క సీటు మాత్రమే గెలుపొందింది. అది కూడా ఎల్జేపీ సాధించిన స్థానం. ఆర్జేడీ-2, MIM-01, స్వతంత్రులు-01 స్థానంలో గెలుపొందారు. కేరళలో 5 సీట్లకు గాను బీజేపీ మరోసారి బోణీ చేయలేకపోయింది. లెఫ్ట్-02, కాంగ్రెస్-02, IUML ఒక స్థానంలో విజయం సాధించాయి. పంజాబ్‌లో 4 స్థానాలకు ఎన్నికలు జరిగితే బీజేపీ మిత్రపక్షం ఒక సీటులో మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ 3 సీట్లు కైవసం చే సుకుంది. అసోంలో 4 స్థానాలకు ఎలక్షన్స్ నిర్వహించగా బీజేపీ 3 చోట్ల విజయం సాధించింది. సిక్కింలో 3 సీట్లకు గాను బీజేపీ 2 స్థానాలు కైవసం చేసుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌లో రెండింటికి రెండు సీట్లు బీజేపీకి వచ్చాయి. రాజస్థాన్‌లో రెండు సీట్లకు గాను కాంగ్రెస్, ఆర్‌ఎల్‌పీలు చెరో స్థానం సాధించాయి. తమిళనాడు లో డీఎంకేకు షాక్ తగిలింది. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటిన డీఎంకే, ఉప ఎన్నికల్లో బోల్తా కొట్టింది. రెండు స్థానాలు జరిగిన ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే విజ యం సాధించింది. అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, పుదుచ్చేరిల్లో అధికారపార్టీలో గెలుపొందాయి.
మొత్తమ్మీద 51 స్థానాలకు గాను బీజేపీ కూటమికి 22 సీట్లు వచ్చాయి. ప్రతిపక్షాలు 29 స్థానాల్లో గెలుపొందాయి. రెండు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే రెండు చోట్లా ప్రతిపక్ష అభ్యర్థులే గెలుపొందారు.