కరోనాను కన్‌ప్యూజ్ చేద్దాం
By తోట వంశీ కుమార్ Published on 29 April 2020 6:19 PM ISTకరోనా దెబ్బకు క్రీడారంగం కుదేలైంది. కరోనా ముప్పు నేపథ్యంలో చాలా క్రీడలు వాయిదా పడగా.. పలు టోర్నీలు వాయిదా పడ్డాయి. ఇక మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో క్రికెటర్లు అందరూ తమకు లభించిన ఈ విరామాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తున్నారు.
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాడు హర్భజన్ సింగ్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. ఫన్ని ఫోటోలతో పాటు మంచి విషయాలను అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా ఈ భారత మాజీ ఆఫ్ స్పిన్నర్.. తల వెనుక భాగంలో ముఖం ఆకారం వచ్చేలా కటింగ్ చేసి ఉన్న ఓ ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.
కళ్లద్దాలు, గెడ్డంతో .. అచ్చం మనిషి ముఖంలాగే ఉన్న ఆ ఫోటో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. ఓ బార్బర్ తన కస్టమర్ తల వెనుక భాగంలో మనిషి ముఖం ఆకారం వచ్చేలా విచిత్రంగా కటింగ్ చేశాడు. కాగా.. ఆఫోటోనే ఇన్ స్టాగ్రామ్‌లో పంచుకున్న భజ్జీ.. 'ఏ వైపు నుండి ప్రవేశించాలో తెలియక కరోనా వైరస్ కన్‌ఫ్యూజ్ అవ్వడానికే ఈ కటింగ్' అంటూ ఆ ఫొటోకు కామెంట్‌ను జతచేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై కామెంట్ల వర్షం కురుస్తోంది. పదండి మనం కూడా ఇలా చేసి కరోనా ను కన్ ప్యూజ్ చేద్దాం అని కామెంట్లు పెడుతున్నారు.