ఆసుపత్రిలో బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ కారు ప్రమాదం నిందితుడు..

By Newsmeter.Network  Published on  8 Dec 2019 12:47 PM GMT
ఆసుపత్రిలో బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ కారు ప్రమాదం నిందితుడు..

· ఆసుపత్రినుంచి వచ్చిన తర్వాతే నిందితుడి అరెస్ట్

· ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్న దర్యాప్తు అధికారులు

హైదరాబాద్ : మితిమీరిన వేగంవల్ల హైదరాబాద్ లోని బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ మీదినుంచి కారు కిందపడిపోయిన ఘటనలో రోడ్డుపై ఉన్న ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసులో నిందితుడైన ఎంపవర్ ల్యాబ్స్ సీఈఓ కల్వకుంట్ల క్రిష్టారావు ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ ఆసుపత్రినుండి వచ్చిన తర్వాతే ఆయనను అరెస్ట్ చేయడానికి వీలవుతుందని పోలీసులు చెబుతున్నారు.

నవంబర్ 23వ తేదీన మితిమీరిన వేగంతో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై కారు నడిపిన కల్వకుంట్ల క్రిష్ణారావు వేగాన్ని అదుపుచేసుకోలేకపోవడంతో కారు ఫ్లైఓవర్ పైనుంచి కిందికి పడిపోయింది. ఆ సమయంలో రోడ్డుపై ఉన్న పి.ఎస్.సత్యవతి అనే 55 సంవత్సరాల మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందంటున్న డాక్టర్లు

ఘటనలో ప్రాణాలు దక్కించుకున్న నిందితుడు కల్వకుంట్ల క్రిష్ణారావు గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. నొప్పులు తగ్గకపోవడంవల్ల , ఫిజియో థెరపీ పూర్తి కాకపోవడంవల్ల ఆయన ఇంకొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తుందని చెబుతున్నారు.

నిలకడగా ఉన్న నిందితుడి ఆరోగ్యం

ప్రమాదంలో నిందితుడి కాలర్ బోన్ ఫ్రాక్టర్ అయ్యింది. ఆపరేషన్ చేసిన డాక్టర్లు దాన్ని సరిచేశారు. కారు నడుపుతున్న సమయంలో సీటు బెల్ట్ పెట్టుకోవడంవల్ల, ఎయిర్ బ్యాగ్స్ వల్ల ఆయన ప్రాణాలు దక్కాయి. ఫిజియో థెరపీ పూర్తయితే ఆయన తన పనులు తను చేసుకోగలిగే పరిస్థితి కలుగుతుందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. కానీ ఈ చికిత్సవల్ల ఎక్కువ నొప్పి కలుగుతుందని, అందుకోసం సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు నిరంతరం ఆయనను పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది.

కేవలం మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నిర్లక్ష్యంగా కారు నడపడం, మితిమీరిన వేగంతో కారునడపడం, ఒక మహిళ ప్రాణాలు పోవడానికి కారకుడు కావడం అనే నేరాలపై నిందితుడిపై కేసు నమోదయ్యింది. నిందితుడు ఆసుపత్రి నుంచి విడుదల అయిన తర్వాతే ఆయన్ని అరెస్ట్ చేయడానికి వీలవుతుందని రాయదుర్గం పోలీస్ స్టేషన్ కి చెందిన ఇన్వెస్టిగేషన్ అధికారి తెలిపారు.

చికిత్స జరుగుతోందని ఆసుపత్రి వర్గాల సమాచారం

నిందితుడికి పూర్తి స్థాయిలో చికిత్స జరుగుతోందని, ఆయన కోలుకోవడానికి మరికొంత కాలం పడుతుందని ఆసుపత్రివర్గాలు ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశాయి. అంతకుమించి దీని గురించి వ్యాఖ్యానించడానికి నిరాకరించాయి.

కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు క్రమం తప్పకుండా ఆసుపత్రికి వెళ్లి నిందితుడి ఆరోగ్య స్థితిని గురించి తెలుసుకుంటున్నారని పోలీస్ అధికారులు చెబుతున్నారు. వారం రోజుల క్రితం నిందితుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి వర్గాల ద్వారా అధికారికమైన సమాచారాన్ని సేకరించామంటున్నారు.

Next Story