బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌.. 43 రోజుల తర్వాత..!

By Newsmeter.Network  Published on  4 Jan 2020 6:51 AM GMT
బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌.. 43 రోజుల తర్వాత..!

హైదరాబాద్‌: నగరంలోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ను 43 రోజుల అధికారులు తెరిచారు. ఫ్లై ఓవర్‌పై వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. నిపుణుల కమిటీ సూచనలతో ఫ్లైఓవర్‌ను తిరిగి జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రారంభించారు. ఫ్లైఓవర్‌ స్వల్ప మరమ్మత్తులతో పాటు, స్పీడ్‌ కంట్రోల్‌కు చర్యలు చేపట్టారు. స్పీడ్‌గన్స్‌, స్పీడ్‌ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం ఫ్లైఓవర్‌ను జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, సీపీ సజ్జనార్‌ పరిశీలించారు. ఫ్లైఓవర్‌పై జరిగిన ప్రమాదాలపై నిపుణుల కమిటీ పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకున్నామని బొంతు రామ్మెహన్‌ తెలిపారు. ప్రమాదాల నివారణకు సంబంధించి నిపుణుల కమిటీ 10 సార్లు అధ్యయనం చేసిందని, ఈ ఫ్లైఓవర్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారని సీపీ సజ్జానార్‌ తెలిపారు. వాహనల వ్యవహారశైలి వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, ఫ్లైఓవర్‌పై స్పీడ్‌గా వెళ్తే రూ.1,100 జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. ఫ్లైఓవర్‌పై సెల్ఫీలను నిషేధించారు.

వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా నిర్మించిన బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌ నవంబర్‌ 4న అందుబాటులోకి వచ్చింది. నవంబర్‌ 9వ తేదీన ఫ్లైఓవర్‌పై సెల్ఫీతీసుకుంటుండగా కారు ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఆ తర్వాత నవంబర్‌ 23న అతివేగం వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టి ఫ్లైఓవర్‌ నుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో ఫ్లైఓవర్‌ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని తీవ్ర దుమారం చెలరేగింది. ఈ రోడ్డు ప్రమాదాలను సీరియస్‌గా తీసుకున్న బల్దియా అధికారులు రహదారుల నిపుణులతో కమిటీ వేశారు. ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్‌పై వాహనాలు 40 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా వేగ నిరోధకాలు, సూచికలు జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఏర్పాటు చేశారు.

Next Story