పట్నానికి పన్నెండు మాల్స్... ఇంకో ఏడాదిలో మరో 12 సూపర్ మాల్స్..!

By Newsmeter.Network  Published on  4 Jan 2020 4:53 AM GMT
పట్నానికి పన్నెండు మాల్స్... ఇంకో ఏడాదిలో మరో 12 సూపర్ మాల్స్..!

ఎవరన్నారు ఆర్ధిక మాంద్యం మనల్ని ముసురుకుంటోందని? ఎవరన్నారు సంక్షోభాలు మనల్ని చుట్టుముట్టేస్తున్నాయని? ఎవరు చెప్పారు రియల్ ఎస్టేట్ కుదైలేందని? ఎవరు చెప్పారు వ్యాపారాలు మందగించాయని? అదే నిజమైతే గతేదాడి మొదటి తొమ్మిది నెలల్లో 60 లక్షల చదరపుటడుగుల వైశాల్యంలో ఒకటి కాదు... రెండు కాదు... పన్నెండు మాల్స్ ఎలా వస్తాయి?

నిజమండీ. ఒక్క హైదరాబాద్ నగరంలోనే గతేడాది పన్నెండు పెద్ద పెద్ద మాల్స్ పుట్టుకొచ్చాయి. వాటి మొత్తం వైశాల్యం అక్షరాలా అరవై లక్షల చదరపుటడుగులు.ఈ మాల్స్ ను సుప్రసిద్ధ మల్టినేషనల్ కంపెనీలైన అమెజాన్, గూగుల్, యాపిల్ వంటివి అద్దెకు తీసుకున్నారు. ఇంతే కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తో సంబంధం లేకుండా 2021 చివరి నాటికి హైటెక్ సిటీ, బేగంపేట, సికింద్రాబాద్, మియాపూర్ వంటి ప్రాంతాల్లో మరో 12 కొత్త సూపర్ షాపింగ్ మాల్స్ రాబోతున్నాయి. వీటిలో లభించేది గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్. మాధాపూర్, గచ్చిబౌలీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో ఆఫీసుల హోరు, జోరు గతంలో కంటే ఎక్కువగా పెరిగిపోయింది. ఇప్పుడు ఉప్పల్, భువనగిరి, వరంగల్ హైవే వంటి ప్రాంతాల్లోనూ ఆఫీస్ స్పేస్ లు వెలుస్తున్నాయి. మెట్రో అందుబాటులోకి రావడం, హైవే విస్తరణ జరుగుతూండటం ఇక్కడ చాలా అనుకూలంగా పరిణమించాయి.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టీ పాస్, ఐటీ హబ్ వంటి పథకాలు కూడా మాల్స్, భవన నిర్మాణాలు ఊపందుకోవడానికి చాలా ఉపయోగపడ్డాయన్నది ఈ రంగం నిపుణుల మాట. రానున్న రోజుల్లో మిగతా చోట్ల తో పోలిస్తే హైదరాబాద్ లో కమర్షియల్ యాక్టివిటీ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. నగర శివార్లలో ఓపెన్ ప్లాట్ల కొనుగోలు మీద కూడా చాలా మంది దృష్టి పెట్టారు. గోడౌన్లు, హోటళ్ల నిర్మాణం కోసం, ఫార్మ్ హౌస్ ల నిర్మాణం కోసం ఈ భూములు ఉపయోగపడతాయన్న అంచనాతో ఇక్కడ డిమాండ్ పెరిగింది.

Next Story