పుణె కు చెందిన ఒక టీచర్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. పూణేలోని దక్కన్ జింఖానాలోని విమలబాయి గోఖలే హై స్కూల్ లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఈమెకు దేశవ్యాప్తంగా ప్రజలు అభిమానులుగా మారారు.

అసలేం జరిగిందంటే.. పుణెలో రోడ్డు పక్కన ఉన్న పాదచారుల బాటపై కొందరు బైక్‌ నడుపుకుంటూ వెళుతుంటారు. అసలు పూణే లోనే కాదు మన దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ జరిగేది ఇదే. అయితే పాదబాటపై అలా బైక్‌ నడుపుకుంటూ వెళుతున్న వ్యక్తులను గోఖలే అనే ఉపాధ్యాయురాలు అడ్డుకున్నారు. రోడ్డుపై బైక్‌ నడపాలని వారికి సూచించారు. అంతే కాకుండా ఎవరు పాదబాటపై బైక్‌ నడపకుండా ఆవిడ కొద్దిసేపు అడ్డుగా నిల్చుకున్నారు. ఈ తతంగం మొత్తాన్ని అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. ఆమె చేసిన పనిని అభినందిస్తూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెట్టారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో ఎంతో చురుకుగ్గా ఉంటారనే విషయం తెలిసిందే. తనకు నచ్చిన అంశాలతో పాటు ఆలోచింపచేసే కథనాలను ఆయన ట్విటర్లో షేర్‌ చేస్తుంటారు. తాజాగా ఆయన ఈ వీడియో  పోస్ట్‌ చేసారు. ‘‘ఈ వీడియో చూసిన వెంటనే నేను ఆంటీలకు అభిమానిగా మారిపోయాను. ఆమె తెగువకు మరింత బలం చేకూరాలి. అంతర్జాతీయ మహిళాదినోవత్సవం సందర్భంగా ఈమెను సత్కరించాలి. లేదంటే వేరేగా అంతర్జాతీయ ఆంటీల దినోత్సవాన్ని ఏర్పాటుచేయాలి. ప్రపంచం వారి వల్లే మంచిగా, సురక్షితంగా ఉంది’’ అని కామెంట్ చేస్తూ వీడియోని రీ ట్వీట్ చేశారు.

 

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.