రెండు ఆటోలను ఢీకొట్టిన ట్రక్కు.. ఏడుగురు మృతి.. 12 మందికి తీవ్ర గాయాలు

By సుభాష్  Published on  15 Jun 2020 10:15 AM GMT
రెండు ఆటోలను ఢీకొట్టిన ట్రక్కు.. ఏడుగురు మృతి.. 12 మందికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం కారణంగా అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వస్తున్న ఓ ట్రక్కు రెండు ఆటోలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గయా జిల్లా బిష్ణుగంజ్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

వీరంతా సమీపంలో ఉన్న ఓ గ్రామంలో జరిగిన శుభకార్యంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. కాగా, గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రోడ్డు ప్రమాదాలు జరుగకుండా పోలీసులు ఎన్నిచర్యలు చేపట్టినా ఏ మాత్రం ఆగడం లేదు. లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని రోజులుగా ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగలేదు. ఇటీవల లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చిన తర్వాత మళ్లీ ప్రమాదాలు మొదలయ్యాయి.Next Story
Share it