బ్రేకింగ్: ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది వలస కూలీల మృతి
By సుభాష్ Published on 19 May 2020 11:16 AM IST![బ్రేకింగ్: ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది వలస కూలీల మృతి బ్రేకింగ్: ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది వలస కూలీల మృతి](https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/05/Bihar-road-accident.jpg)
రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. లాక్‌డౌన్ కారణంగా వలస కూలీలకు శాపంగా మారింది. లాక్‌డౌన్ నుంచి వలస కూలీలకు కేంద్రం సడలింపులు ఇవ్వడంతో , స్వస్థలాలకు బయలుదేరిన కూలీలు రోడ్డు ప్రమాదం కారణంగా మృత్యువాత పడుతున్నారు. మంగళవారం బీహార్ రాష్ట్రం బగల్‌పూర్‌లోని నౌగచియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది వలస కూలీలు మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు.
బస్సు-లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వలస కూలీలతో వెళ్తున్న లారీ అదుపుతప్ప బస్సునుఢీకొట్టింది. దీంతో లారీ రోడ్డుపక్కన పడిపోయింది. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కాగా, 16వ తేదీన కూడా ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 23 మంది వలస కూలీలు మృత్యువాత పడ్డారు. ఇంకెందరో తీవ్రంగాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వలస కూలీలతో వెళ్తున్న ట్రక్కును మరో ట్రక్కు ఢీకొట్టింది. వలస కూలీలు వెళ్తున్న ట్రక్కు రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెళ్తోంది. అలాగే ఇదే రోజు నిర్మల్‌లో కూడా వలస కూలీలతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడటంతో 49 మంది కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇలా ప్రతి రోజు జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మృతి చెందుతున్నది వలస కూలీలే.