కరోనా ఎఫెక్ట్‌: రాష్ట్రంలో సెప్టెంబర్‌ 6 వరకు లాక్‌డౌన్‌

By సుభాష్  Published on  17 Aug 2020 11:47 AM GMT
కరోనా ఎఫెక్ట్‌: రాష్ట్రంలో సెప్టెంబర్‌ 6 వరకు లాక్‌డౌన్‌

దేశంలో కరోనా వైరస్‌ కాలరాస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఫలితం లేకుండా పోతోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను సైతం గజగజ వణికిస్తోంది. ఇక బీహార్ రాష్ట్రంలో కూడా కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రంలో సెప్టెంబర్‌ 6వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ బీహార్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సోమవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్‌ 6 వరకూ రాష్ట్రంలో లాక్‌డౌన్ ఆంక్షలు అమలులో ఉంటాయని రాష్ట్ర హోంశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు లాక్‌డౌన్‌కు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. వైరస్‌ కట్టడికి కంటైన్‌మెంట్‌, బఫర్‌ జోన్లలో ఆంక్షలు మరింత కఠినతరం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

లాక్‌డౌన్‌ పొడిగింపు కాలంలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు 50 శాతం ఉద్యోగులతోనే పని చేయాల్సి ఉంటుందని, రైలు, విమాన సర్వీసులు మామూలుగా పని చేస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే అన్ని విద్యాసంస్థలు, ప్రార్థనా స్థలాలు, బస్సులు, పార్క్‌లు, జిమ్ములు మూసే ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ సమయంలో ఎవరైన నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, బీహార్‌ రాష్ట్రంలో కొత్తగా 2,187 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 1.04 లక్షలకు చేరింది.

కాగా, దేశంలో ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు, వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 57,981 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 941 మంది మృతి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అదికారులు ప్రకటించారు. సోమవారం నాటికి దేశంలో మృతుల సంఖ్య 50,921 చేరింది. ఇక ఇప్పటి వరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య26,47,663కు చేరింది. నిన్న ఒక్క రోజు వైరస్‌ నుంచి 57వేల మంది కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 72.5శాతం ఉండగా, మరణాల రేటు దాదాపు 1.9శాతంగా ఉంది. కాగా, ప్రస్తుతం భారత్‌లో కరోనా తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ, ఎక్కవగా మరణాల రేటు మూడు రాష్ట్రాల్లోనే ఉంది. అవి గుజరాత్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు. గుజరాత్‌ రాష్ట్రంలో 3.56 శాతం కాగా, మహారాష్ట్రలో 3.38, అలాగే మధ్యప్రదేశ్‌లో 2.46 శాతం ఉన్నట్లు కేంద్రం తెలిపింది.

Next Story
Share it