వజ్రాల దొంగలు చిక్కారిలా..!

By అంజి  Published on  13 Feb 2020 6:01 AM GMT
వజ్రాల దొంగలు చిక్కారిలా..!

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లో ఓ వ్యాపారి ఇంట్లో బంగారు, వజ్రాభరణాలను చోరీ చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నగల వ్యాపారి ఇంట్లో పని మనుషులుగా చేరి రూ.2.5 కోట్ల విలువైన బంగారు నగలు, వజ్రాలను దొంగతనం చేశారు. చోరీ తర్వాత ముఠా సభ్యులు బిహార్‌కు పారిపోయారు. బంగారు నగలను అమ్మి సొత్తు చేసుకున్న ముఠా సభ్యులు.. వజ్రాలను మాత్రం ఇంటి పక్కనే ఉన్న ఓ కొట్టాంలో దాచిపెట్టారు. ముఠా సభ్యుల్లో నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఇప్పటి వరకు ఈ ముఠా సభ్యులు దేశ వ్యాప్తంగా 50 చోరీలకు పాల్పడినట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ తెలిపారు.

ఇండ్లలో వంటమనిషిగా చేరి.. కొన్ని రోజుల తర్వాత యాజమానుల కళ్లుగప్పి భగవత్‌ ముఖియా చోరీలకు పాల్పడేవాడు. భగవత్‌ ముఖియా సొంతూరు బీహార్‌ రాష్ట్రాంలోని నిర్భాపూర్‌. కాగా అదే ప్రాంతానికి చెందిన రామ్‌ ఆశిష్‌ ముఖియా, రాహుల్‌, పీతాంబర్‌ మండల్‌, భోలా, హరిశ్చంద్ర కలిసి ఓ గ్యాంగ్‌ ఏర్పాటయ్యారు. భోలా ముఖియా ఈ గ్యాంగ్‌ను లీడ్‌ చేసేవాడు. ధనవంతుల ఇండ్లలో పని చేసేందుకు వంటమనిషి, కారు డ్రైవర్‌, స్వీపర్‌, కేర్‌టేకర్‌లను సప్లై చేసే ఏజెంట్‌గా భోలా ముఖియా వ్యవహరించేవాడు.

దేశంలోని ప్రధాన నగరలా వీరి టార్గెట్‌. ఢిల్లీ, చెన్నై, పాట్నా.. ఇప్పుడు హైదరాబాద్‌తో పాటు చాలా ప్రాంతాల్లో వీరు చోరీలకు పాల్పడ్డారు. అయితే ఈ గ్యాంగ్‌కు అడ్డు తగిలితే చంపేందుకూ వెనకాడరని తెలుస్తోంది. పోయిన సంవత్సరం ముఖియా గ్యాంగ్‌ హైదరాబాద్‌ను టార్గెట్‌ చేసింది. బంజారాహిల్స్‌లోని రోడ్‌ నెంబర్‌ 12లో గల నగల వ్యాపారిని ముఖియా గ్యాంగ్‌ ట్రాప్‌ చేసింది. రామ్‌ అశిష్‌ను వంటమనిషిగా భోలా ముఖియా ఆ ఇంట్లో చేర్పించాడు. ఇంకేం.. ఆ ఇంట్లోని డబ్బులు దాచే సీక్రెట్‌ లాకర్లను రామ్‌ ఆశిష్‌ గుర్తించాడు. డిసెంబర్‌ 8వ తేదీన వ్యాపారి కపిల్‌ గుప్తా కుటుంబం.. శంషాబాద్‌లో వారి బంధువులకు సంబంధించిన ఓ కార్యక్రమానికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ముఖియా గ్యాంగ్‌కు చోరీకి పాల్పడింది. మొత్తం రూ.2.50 కోట్ల బంగారం, వజ్రాలను దొంగిలించి బీహార్‌కు పారిపోయారు.

45 రోజుల పాటు నిఘా..

ఆ మరుసటి ఇంటికి వచ్చిన కపిల్‌ గుప్తా.. ఇంట్లో చోరీ జరిగిందనే విషయం తెలుసుకున్నాడు. దీనిపై వెంటనే కపిల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏసీపీ కె.ఎస్‌.రావు ఆధ్వర్యంలో డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ బృందం ఈ కేసును దర్యాప్తు చేసింది. రామ్‌ ఆశిష్‌ ఫోన్‌ నెంబర్‌ ట్రాక్‌ చేసిన పోలీసులు అతడు బీహార్‌లో ఉన్నట్లు గుర్తించారు. మధుబని జిల్లాలో ముఖియా గ్యాంగ్‌ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లారు. అయితే అప్పటికే రామ్‌ ఆశిష్‌ అక్కడి నుంచి పారిపోయాడు. వెళ్లేముందు దోచుకున్న సోత్తును గోడల్లో దాచి పెట్టి.. వాటికి కాపలాగా మహిళలను పెట్టిపోయాడు. అయితే వాళ్లను పట్టుకునేందుకు డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ రవి కుమార్‌ బృందం 45 రోజుల పాటు మారువేషాల్లో అక్కడే నిఘా పెట్టింది. గత నెలలో భగవత్‌ ముఖియా, భోలా ముఖియా, హరిశ్చంద్ర ముఖియాలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా ప్రధాన నిందితుడు రామ్‌ ఆశిష్‌ను బుధవారం అరెస్ట్‌ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. అలాగే గోడల్లో దాచిన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Next Story
Share it