భవనం కూలిన ఘటనలో 17కు చేరిన మృతుల సంఖ్య
By సుభాష్ Published on 22 Sep 2020 4:30 AM GMTమహారాష్ట్రలోని థానే జిల్లా భీవండి పట్టణంలో మూడంతస్థుల భవనం కూప్పలిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 17కు చేరింది. సహాయక చర్యలు చేపడుతున్న ఎన్డీఆర్‌ఎఫ్ అధికారికంగా ప్రకటించింది. శిథిలాల కింద ఉన్నవారు తీవ్రంగా గాయపడటంతో చికిత్స కొనసాగుతోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భవనంలో నివసిస్తున్న వారంతా గాఢ నిద్రలో ఉండగానే సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో అకస్మాత్తుగా భవనం కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. అయితే భవనంలో దాదాపు 20కుపైగా ప్లాట్లు ఉండగా, తెల్లవారుజామున ప్రమాదం సంభవించడంతో మృతులు, గాయపడిన వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం జరగగానే స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని 20 మందిని కాపాడారు. అలాగే పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలకు సమాచరం అందించడంతో వారు చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. భీవండీ పట్టణంలో పటేల్ కాంపౌండ్ ప్రాంతంలో 1984లో ఈ భవనాన్ని నిర్మించారు. కాగా, ఆగస్టు 24న మహారాష్ట్రలోని రాయ్‌ఘఢ్‌లో భవనం కూలి దాదాపు 18 మంది వరకు మృతి చెందారు.
భవనం శిథిలావస్థకు చేరుకోవడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. భీవండీ ఘటన ఎంతగానో కలచివేసింది. బాధితుల కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. అలాగే ప్రధాని మోదీ కూడా ట్వీట్ చేశారు. తీవ్ర ఆవేదనలో ఉన్న కుటుంబాలకు నా సంతాపం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. బాధితులకు అన్ని విధాలుగా సాయం అందిస్తాం.. అని ట్వీట్ చేశారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.