హీరో నితిన్‌కు పెళ్లికి ముందే కొత్త కష్టాలు

By సుభాష్  Published on  18 Feb 2020 1:41 PM IST
హీరో నితిన్‌కు పెళ్లికి ముందే కొత్త కష్టాలు

హీరో నితిన్‌కు పెళ్లికి ముందే కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. నితిన్‌, రష్మిక మందన నటిస్తున్న 'భీష్మ' మూవీ వెంకీ కుడుముల డైరెక్షన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. ఇక షూటింగ్‌తో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం టైటిల్‌ విషయంలో చిక్కులు ఎదురవుతున్నాయి. టైటిల్‌ మార్చాలని కొన్ని వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మహాభారతానికి మూల పురుషుడు, ఆ జన్మ బ్రహ్మచార్యం పాటించిన భీష్ముడి పేరుతో రొమాంటిక్‌ కామెడీ చిత్రాన్ని రూపొందించడంపై బీజేపీ ధార్మిక సెల్‌ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 'భీష్మ' అనే పేరుతో సినిమా విడుదల చేయడం ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని పేర్కొంటున్నారు. ఈ సినిమా టైటిల్‌కు సంబంధించి హైదర్‌గూడలో ధార్మిక సెల్‌ కన్వీనర్‌ తూములూరి శ్రీకృష్ణచైతన్య శర్మ, ప్రధాన కార్యదర్శి రాము, ఇతర కార్యవర్గ సభ్యులు సమావేశమయ్యారు.

Bheeshma 1

సినిమా టైటిల్‌ను వెంటనే మార్చాలి

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భీష్మ సినిమా టైటిల్‌ను వెంటనే మార్చాలని డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. కాగా, భీష్ముని పేరు పెట్టి సినిమాలో హీరోను లవర్‌ బాయ్‌గా చూపించడం సరైంది కాదని అన్నారు. ఒక వేళ ఈ సినిమా టైటిల్‌ను మార్చకుంటే విడుదలను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. అవసరమైతే కోర్టును కూడా ఆశ్రయిస్తామన్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ కూడా విడుదలైంది. ట్రైలర్‌ చూస్తే.. కామెడీ సీన్స్‌ తో ఆకట్టుకునేలా ఉంది. అంతకు ముందే టీజర్‌, ఫస్ట్‌ లుక్‌లతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా సినిమా నిర్మాతలకు రిలీజ్‌కు ముందే మంచి లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను రూ. 25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.

Next Story