రంజన్ ఖాన్ కుటుంబానికి సంతోషాన్నిచ్చిన పద్మశ్రీ

By అంజి  Published on  28 Jan 2020 5:11 AM GMT
రంజన్ ఖాన్ కుటుంబానికి సంతోషాన్నిచ్చిన పద్మశ్రీ

ముఖ్యాంశాలు

  • భజన సింగర్ రంజన్ ఖాన్ కి పద్మశ్రీ పురస్కారం
  • జైపూర్ లో భజనలు పాడే వృత్తిలో ఉన్న రంజన్
  • రంజన్ తనయుడు ఫిరోజ్ ఖాన్ బెనారస్ హిందూ వర్సిటీ ఉద్యోగి
  • ఫిరోజ్ ఖాన్ కి సంస్కృత శాఖలో ఉద్యోగంపై నిరసనలు
  • తీవ్రమైన ఒత్తిడిని, మనో వేదనను ఎదుర్కున్న కుటుంబం
  • రంజన్ కి పద్మశ్రీ పురస్కారంతో ఆ కుటుంబానికి సంతోషం

జైపూర్ : అరవై ఒక్క సంవత్సరాల భజన్ సింగర్ రంజన్ ఖాన్ కి పద్మశ్రీ పురస్కారం వచ్చిన ఇంకా పూర్తి స్థాయిలో కలగడం లేదు. ఆయనకు పద్మ అవార్డ్ ఇవ్వడంపై అనేక విమర్శలు దేశ వ్యాప్తంగా వెల్లువెత్తిన విషయం తెలిసిందే. రెండు నెలల క్రితం ఆయన కొడుకు ఫిరోజ్ ఖాన్ కి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో సంస్కృత శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం ఇవ్వడంపైకూడా విపరీతంగా నిరసనలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ఆ కుటుంబం అన్ని విధాలుగానూ తీవ్ర స్థాయి ఒత్తిడిలో ఉంది. భయంతో ఉంది.

ఈ సందర్భంలో రంజన్ ఖాన్ కి పద్మశ్రీ పురస్కారం రావడం నిజానికి ఆ కుటుంబానికి కొంత ఊరటగా ఉందనే చెప్పాలి. ఆ కుటుంబంలో ఈ వార్త కొంత సంతోషాన్ని నింపింది. ఫిరోజ్ ఖాన్ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెషర్ ఉద్యోగంలో చేరగానే నవంబర్ 7, 2019న పెద్ద ఎత్తున నాలుగు రోజుల పాటు ఆ నియామకాన్ని వ్యతిరేకిస్తూ రైటిస్టులు ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు జరిపిన విషయం తెలిసిందే.

రాజీనామా చేసి ఆర్ట్స్ డిపార్ట్ మెంట్ లో చేరిన ఫిరోజ్ ఖాన్..

కేవలం తనో ముస్లిం మతస్తుడు అన్న కారణంగా ఆ నియామకాన్ని నిరసిస్తూ జరిగిన ఆందోళనలను పురస్కరించుకుని ఫిరోజ్ ఖాన్ సంస్కృత శాఖలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి డిసెంబర్ 9, 2019న ఆర్ట్స్ విభాగంలో ఉద్యోగంలో చేరారు. ఫిరోజ్ ఖాన్ తండ్రి రంజన్ ఖాన్ జైపూర్ లో బగ్రూ సంప్రదాయానికి చెందిన సంగీతవేత్త, భజన్ సింగర్. కొన్ని తరాలుగా ఈ కుటుంబంలోనివాళ్లు వారసత్వంగా ఓ హిందూ ఆలయంలో రామ- కృష్ణ భజనలను ఆలపిస్తున్నారు. అదే వాళ్లకు జీవనోపాధి.

శ్రీ శ్యామ్ సురభి వందన పేరుతో రంజన్ ఖాన్ ఓ భక్తి పుస్తకాన్నికూడా రాశారు. రాముడు, కృష్ణుడు, శివుడు, విష్ణువు ఇతర హిందూ దేవతల భజనలపై ఆయన ఈ పుస్తకంలో అద్భుతమైన వ్యాఖ్యానాలు రాశారు. పుట్టుకతో ముస్లిం అయినప్పటికీ ఆయనకు వంశపారంపర్యంగా వచ్చిన హరి భక్తి బాగా అబ్బింది. ఆయనకు గోవులంటేకూడా చాలా ప్రేమ. ఆ కారణంగా ఆయన ప్రత్యేకంగా ఓ గోశాలనుకూడా నడుపుతున్నారు.

తన తండ్రికి పద్మశ్రీ పురస్కారం వచ్చిందన్న విషయాన్ని తెలుసుకున్న ఫిరోజ్ ఖాన్ మొదట ఆ వార్తను నమ్మలేదు. తర్వాత మెల్లగా ఆయనే తన తండ్రికి ఆ శుభవార్తను చెప్పారు. తనకు ఆ వార్తను జీర్ణం చేసుకోవడానికి చాలాసేపు పట్టిందని ఫిరోజ్ ఖాన్ చెబుతున్నారు. భజనలు పాడడం వంశపారంపర్యంగా వస్తున్న వృత్తి. దానివల్లే మా కుటుంబానికి ఆదాయం వస్తోంది. ఇక పురస్కారాలేవీ నేను ఆశించలేదు. ఇప్పుడు వచ్చింది కాబట్టి దీన్ని నేను భగవంతుడి అనుగ్రహంగా భావిస్తున్నాను. ఆయన ప్రసాదంగానే స్వీకరిస్తాను అంటూ హుందాగా రంజన్ ఖాన్ వ్యాఖ్యానించడం విశేషం.

Next Story