కమనీయం..కడు రమణీయం..రాములోరి కల్యాణం

By రాణి  Published on  2 April 2020 8:21 AM GMT
కమనీయం..కడు రమణీయం..రాములోరి కల్యాణం

ముఖ్యాంశాలు

  • నిరాడంబరంగా భద్రాద్రి రామయ్య కల్యాణం
  • వెలవెలబోయిన మిథిలా కల్యాణ మండపం
  • పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేసిన మంత్రులు

శ్రీ రామ నవమి..లోకానికి ఆదర్శ దంపతులైన సీతారాముల కల్యాణం జరిగిన రోజు. ప్రతి ఏటా శ్రీ రామ నవమి రోజున శ్రీరాముడు కల్యాణ రాముని అవతారమెత్తి సీతమ్మను పెండ్లాండుతాడు. అయోధ్య రాముడు భారతీయుల ఇలవేల్పు అయితే..భద్రాద్రి రాముడు తెలుగు ప్రజల ఇలవేల్పుగా కొలుస్తారు. భక్త రామదాసు సంకల్పిత ఈ భద్రాద్రి రామాలయంలో ఏటా అంగరంగవైభవంగా జరిగేది భద్రాద్రి బ్రహ్మోత్సవం..శ్రీ రాములోరి కల్యాణం. కానీ ఈ ఏడాది మాత్రం పరిమిత సంఖ్యలో అతిథులు, భక్తుల మధ్య అతి సుందరమైన సీతారాముల కల్యాణ ఘట్టం ముగిసింది. కరోనా ప్రభావంతో భద్రాచల సీతారాముల కల్యాణోత్సవానికి భక్తులు రావొద్దంటూ ప్రభుత్వం, ఆలయ కమిటీ విజ్ఞప్తి చేయడంతో భక్తులు లేకుండానే భద్రాద్రి బ్రహ్మోత్సవం జరిగింది.

Also Read : అంకుల్ వద్దు అంకుల్..ప్లీజ్ ఆపండి అంకుల్..మా డాడీ అంకుల్..

ఆనవాయితీ ప్రకారం..తెలంగాణ ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు స్వామివార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కల్యాణాన్ని వీక్షిచేందుకు వచ్చిన మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు కెవి రమణ చారి, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య , మహబూబాద్ ఎంపీ కవిత, భద్రాచలం ఎమ్మెల్యే పొందెం వీరయ్య, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, భద్రాచలం ఈవో నరసింహులు తదితరులంతా మీటర్ దూరంలో మాస్కులు ధరించి కూర్చున్నారు. భక్తులు లేక మిథిలా మండలం వెలవెలబోయింది. 40-60 మంది భక్తుల సమక్షంలో రాములోరి కల్యాణం సాదాసీదాగా, నిరాడంబరంగా జరిగింది. కానీ.. సీతమ్మకు సిగ్గు ఏమాత్రం తగ్గలేదు. కల్యాణ తంతు అంతా ఎప్పటి లాగానే జరిగింది. భక్తులంతా ఈ కమనీయ దృశ్యాన్ని ఇళ్లల్లోనే కూర్చుని టీవీల్లో వచ్చిన ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించి తృప్తి చెందారు.

Also Read : కరోనాతో వ్యక్తి మృతి..ముగ్గురు భార్యలు, 16 మంది పిల్లల పరిస్థితి ?

ఒక్క భద్రాచలంలోనే కాదు..దేశ వ్యాప్తంగా ఉన్న రామాలయాలన్నింటిల్లోనూ భక్తుల రాకపై నిషేధం ఉంది. ఆచారం ప్రకారం కల్యాణ క్రతువులైతే జరిగాయి గానీ..ఆ కమనీయ ఘట్టాన్ని చూసేందుకు భక్తులను మాత్రం ఆలయాల్లోకి రానివ్వలేదు. సీతారాముల కల్యాణం అయిపోయింది. ఇకనైనా కరోనా విజృంభించకుండా రాములవారు కాపాడాలని భక్తులు వేడుకుంటున్నారు.

Next Story
Share it