అబ్బే ధోనిలో ఆ క‌సిలేదు.. సిక్స‌ర్లు కొట్టాల్సిన చోట సింగిల్స్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 May 2020 12:54 PM IST
అబ్బే ధోనిలో ఆ క‌సిలేదు.. సిక్స‌ర్లు కొట్టాల్సిన చోట సింగిల్స్

ఎన్నో ఆశ‌ల‌తో 2019 వ‌ర‌ల్డ్ క‌ప్ బ‌రిలోకి దిగిన టీమ్ఇండియా సెమీఫైన‌ల్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓట‌మి పాల‌వ‌డంతో ఇంటి దారి ప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఆ మ్యాచ్ అనంత‌రం భార‌త మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని ఇప్ప‌టి వ‌ర‌కు తిరిగి టీమ్ ఇండియా జెర్సీ ధ‌రించ‌లేదు. మ‌హీ మ‌ళ్లీ రీ ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడా అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్ర‌పంచ క‌ప్ లో మ‌హేంద్రుడు బ్యాటింగ్ పై ఎన్నో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. తాజాగా ఇంగ్లాండ్ జ‌ట్టు ఆల్‌రౌండ‌ర్ బెన్‌స్టోక్స్ ధోని ఆట‌తీరుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. అస‌లు ధోనిలో గెల‌వాల‌న్న క‌సి క‌నిపించ‌లేద‌ని, సిక్స‌ర్లు కొట్టాల్సిన టైంలో సింగిల్స్ కు మ‌హీ ప్రాధాన్యం ఇచ్చాడ‌ని అంటున్నాడు బెన్ స్టోక్స్‌. 2019 ప్ర‌పంచ క‌ప్‌ను ఇంగ్లాండ్ జ‌ట్టు ముద్దాడ‌డంతో కీల‌క పాత్ర వ‌హించాడు బెన్‌స్టోక్స్.

ఇంగ్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్ లో ధోని ఆట‌లో అస‌లు తీవ్ర‌త క‌నిపించ‌లేద‌ని, కెప్టెన్ విరాట్ కోహ్లీ, హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ భాగ‌స్వామ్యం విస్మ‌య‌ప‌రిచింద‌న్నాడు స్టోక్స్. ఆ మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. 'భారత్ గెలవాలంటే 11 ఓవర్లలో 112 పరుగులు చేయాల్సిన తరుణంలో క్రీజులోకి వ‌చ్చాడు. ధోని ఎడాపెడా బౌండ‌రీలు బాదుతాడ‌ని అనుకున్నా.. అయితే ధోనీ బ్యాటింగ్ తనకు వింతగా అనిపించిందని' స్టోక్స్ పేర్కొన్నాడు.

‘వాస్తవానికి మరో 12 బంతులు ముందుగానే భారత్ 338 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్నానని భావించాను. కానీ సిక్సర్ల మీద ఫోకస్ చేయాల్సిన ధోనీ సింగిల్స్ తీయడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. నింపాదిగా అతడు సింగిల్స్ తీసుకుంటూ మ్యాచ్‌ను భారత్ నుంచి దూరం చేశాడనిపిస్తోందని, కేదార్ జాదవ్ సైతం చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. గెలుపు కోసం యత్నించకుండా కేవలం సింగిల్స్‌కే పరిమితం కావడంతో ధోనీలో గెలవాలన్న కసి కనిపించలేదు. ఇక మరోవైపు ఓపెనర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు 27ఓవర్ల వరకు క్రీజులో ఉన్నా కేవలం 138 పరుగులే జోడించడం జట్టుకు పెద్ద మైన‌స్ అని చెప్ప‌వ‌చ్చు. వారు బ్యాటింగ్‌ చేసిన విధానం మాత్రం విచిత్రంగా ఉంది. ఇద్దరు ఏమాత్రం గొప్పగా ఆడలేదు. వారు మాపై ఏ మాత్రం ఒత్తిడి పెంచే ఉద్దేశంతో కనిపించలేదు. దాంతో ఆట మా వైపు మళ్లిందని' స్టోక్స్ తెలిపాడు.

ఇక ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 7 వికెట్ల న‌ష్టానికి 337 ప‌రుగులు చేసింది. భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ 5 వికెట్ల న‌ష్టానికి 306 ప‌రుగులు మాత్ర‌మే సాధించింది.

Next Story