భద్రం..బీ కేర్ ఫుల్ బ్రదరూ..!
By రాణి Published on 20 March 2020 7:00 AM GMTభద్రం..బీ కేర్ ఫుల్ బ్రదరూ..! అప్పుడెప్పుడో మనీ సినిమాలో కోటా శ్రీనివాసరావు పాడిన పాట అనుకోకండి. ఇది మీ శ్రేయస్సు కోసం చెప్తున్నామండి. కరోనా వైరస్ ఒకేసారి ఏ వందమందికో వస్తేనే అందరికీ ప్రమాదం అనుకుంటే పొరపాటే. వందలో ఒక్కరికి కరోనా వైరస్ ఉన్నా..అది అతని చుట్టూ ఉన్న వందమందికి..ఆ వందమంది చుట్టూ ఉన్న వేల మందికి..అలా అలా లక్షలు, కోట్ల మందికి వరకూ వ్యాపించినా అవాక్కవ్వక్కర్లేదు. భారత్ లోనే ఉన్నవారిలో కరోనా వైరస్ ఉన్నట్లుగా ఇప్పటి వరకూ నిర్థారణవ్వలేదు. కానీ..ఇతర దేశాల్లో స్థిరపడిన భారతీయులు అక్కడ కరోనా భయంతో ఇక్కడికి వచ్చారు. అలా వచ్చినవారిలోనే ఎక్కువగా కరోనా బాధితులున్నారు. ఎయిర్ పోర్ట్ లో స్ర్కీనింగ్ టెస్ట్ ల సమయంలో కరోనా లక్షణాలు కనిపించపోయినప్పటికీ..వారు క్వారంటైన్ సెంటర్లలో ఉన్నప్పుడో..ఇళ్లకు చేరుకున్నప్పుడో ఆ లక్షణాల బయటపడుతున్నాయి. ఫలితంగా ఈ లక్షణాలు కుటుంబ సభ్యులు, ఆ చుట్టుపక్కల వారికి కూడా వ్యాపించే ప్రమాదముంది. అందుకే ఎవరైనా..ఎక్కడైనా సరే గుంపులు గుంపులుగా తిరగవద్దని ఇప్పటికే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు సూచించాయి.
Also Read : ఏపీలో మూడుకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు, మాల్స్, పర్యాటక ప్రదేశాలు, దేవాలయాలు, స్విమ్మింగ్ పూల్స్ అన్నింటినీ మూసివేశారు. చాలా సంస్థల్లో ఉద్యోగులకు రెండువారాలపాటు సెలవులిచ్చేశారు. సెలవులిచ్చాం కదా అని..విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉద్యోగులు దూరప్రయాణాలు చేయడం మంచిదికాదన్నారు. ఎవరికి వారు సెల్ఫ్ క్వారంటైన్ చేసుకుంటేనే కరోనాను నివారించగలమని రాష్ర్ట మంత్రులు చెప్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయట తిరగరాదని సూచిస్తున్నారు. ముఖానికి మాస్కులు వేసుకోవడం, చేతులు శుభ్రం చేసుకోవడం, శానిటైజర్ల వాడకాన్ని తప్పనిసరి చేశారు. ఇప్పటి వరకూ ఆంధ్రాలో మూడు, తెలంగాణలో 16 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో నమోదైన 16 కేసులు కూడా ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చినవారివే. వీరిలో 8 మంది ఇండోనేషియన్లు కూడా ఉన్నారు. దేశ వ్యాప్తంగా 5 కరోనా మరణాలు నమోదవ్వగా..వారిలో ఒక విదేశీయుడున్నట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. తెలంగాణలో ట్రాఫిక్ పోలీసులు కూడా సిగ్నల్ పడినపుడు వాహనదారులకు కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తున్నారు.
Also Read : పెరగనున్న నిత్యావసర ధరలు
యముడికి ఏజెంట్ లా పనిచేస్తోంది
172 దేశాలకు వ్యాపించిన కరోనా యముడికి ఏజెంట్ లా పనిచేస్తోంది. దీని ప్రభావం ఇప్పుడు ఇటలీలో ఎక్కువగా ఉంది. చైనాలో నమోదైన కరోనా మరణాలకన్నా ఇటలీలోనే ఎక్కువగా చనిపోయారు. చైనాలో 3,248మంది కరోనా బాధితులు చనిపోతే..ఇటలీలో కరోనా మృతుల సంఖ్య చైనాను మించిపోయింది. అంతేకాదు..చైనాకన్నా ఇక్కడ రికార్డు స్థాయిలోకరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 10,048మంది కరోనా బాధితులు చనిపోగా..2 లక్షల మందికి పైగా కరోనాతో ఆస్పత్రుల్లో పోరాడుతున్నారు.