ఐపీఎల్ ర‌ద్దు.. బీసీసీఐకి భారీ న‌ష్టం త‌ప్ప‌దా..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 April 2020 5:07 AM GMT
ఐపీఎల్ ర‌ద్దు.. బీసీసీఐకి భారీ న‌ష్టం త‌ప్ప‌దా..!

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈమ‌హ‌మ్మారి ధాటికి క్రీడారంగం కుదేలైంది. మ‌న దేశంలో ఈ వైర‌స్ రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ వైర‌స్ క‌ట్ట‌డికి దేశ‌వ్యాప్త లాక్‌డౌన్‌ను విధించిన విష‌యం తెలిసిందే. దీంతో క్రీడాకారులంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కి మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్)-13వ సీజ‌న్ ఏప్రిల్ 15 కు వాయిదా ప‌డింది. అయితే.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఈ నెల 15 నుంచి టోర్నీ జ‌ర‌గ‌డం అనుమానంగా మారింది. ఇక టోర్నీని సెప్టెంబ‌ర్‌ నెల‌లో మినీ ఐపీఎల్ గా నిర్వ‌హించ‌వ‌చ్చు అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు.

అయితే.. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదిక‌గా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌నుంది. దానికి ముందు వివిధ దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో ఐపీఎల్ సెప్టెంబ‌ర్‌లో నిర్వ‌హించ‌డం సాధ్యం కాక‌పోవ‌చ్చు. ఐపీఎల్ 2020 సీజ‌న్ ర‌ద్దు అయితే.. బీసీసీఐ భారీగానే న‌ష్ట‌పోనుంది. ఈ ఏడాది ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ జ‌ర‌గ‌కపోయినట్లు అయితే రూ.3800కోట్ల న‌ష్టం జ‌ర‌గ‌నుంద‌ని ఓ నివేదిక వెల్ల‌డించింది. క‌రోనా వైర‌స్ నుంచి భీమా ర‌క్ష‌ణ లేక‌పోవ‌డంతో దీనికి సాధార‌ణ భీమా వ‌ర్తించ‌దు. ఇందులో ఐపీఎల్ ప్రసార‌దారుకే ఎక్కువ న‌ష్టం వాటిల్ల‌నుంది. రూ.3200కోట్లు న‌ష్టపోనుంది. అయితే.. ఈ ఏడాది ఐపీఎల్ జ‌ర‌గ‌లేదు కాబ‌ట్టి ప్ర‌సార హ‌క్కుల కోసం తాము చెల్లించాల్సిన భారీ మొత్తం నుంచి మిన‌హాయింపు ఇవ్వాల‌ని స్టార్ బోర్డును కోరే అవ‌కాశం ఉంద‌ని వ్యాపార వ‌ర్గాలు చెబుతున్నాయి. ఒప్పందంలో ఇలాంటి నిబంధ‌న ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని అంటున్నారు. ఇక మిగిలిన రూ.600కోట్లు.. బోర్డుతో పాటు, ప్రాంచైజీలు, రాష్ట్ర క్రికెట్ సంఘాలు, హోటల్స్, ప‌న్ను రూపంలో ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలకు ఈ న‌ష్టం రానుంది.

వింబుల్డన్‌ కు భీమా..!

క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు ప్ర‌తిష్టాత్మ‌క వింబుల్డన్ టోర్నీ ర‌ద్దు అయిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఈ టోర్నీ ర‌ద్దు అయినా పైసా న‌ష్టం లేద‌ట‌. పైగా కోట్ల రూపాయ‌లు వారికి అంద‌నున్నాయి. ఆల్ఇంగ్లాండ్ క్ల‌బ్ ముందుచూపే వారి కొంప మున‌కుండా కాపాడింది. పాల‌సీలో ప్ర‌కృతి వైప‌రిత్యాల‌తో పాటు బంద్ లతో పాటు వైర‌స్ వ‌ల్ల ఆట ర‌ద్దు అయినా కూడా భీమా వ‌ర్తించేలా క్లాస్‌ను చేర్చారు. ఈ క్లాస్ ఇప్పుడు ఇంగ్లాండ్ క్ల‌బ్‌కు శ్రీరామ ర‌క్ష అయ్యింది. 141మిలియ‌న్ డాల‌ర్లు అంటే మ‌న క‌రెన్సీలో రూ.1064కోట్లు ఆల్ఇంగ్లాండ్ క్ల‌బ్‌కు రానున్నాయి. దీనిపై క్ల‌బ్ చీప్ ఎగ్జిక్యూటీవ్ రిచ‌ర్డ్ లూయిస్ మాట్లాడుతూ.. ముందు జాగ్ర‌త్త‌గా మేం తీసుకున్న పాల‌సీనే ఇప్పుడు మాకు అండ‌గా నిలిచింది. అయితే.. పాల‌సీ సొమ్ము అందేందుకు ఇంకా స‌మ‌యం ప‌డుతుంది. పేప‌ర్ వ‌ర్క్ పూర్తి అవ్వాల‌న్నారు. కాగా.. 2002లో సార్స్ వైర‌స్ వెలుగు చూసింది. దీంతో 2003 నుంచి బీమా ప‌రిధిలోకి వైర‌స్ ల‌ను కూడా చేర్చారు.

Next Story
Share it