ఐపీఎల్ రద్దు చేస్తే రూ.4వేల కోట్ల నష్టం
By తోట వంశీ కుమార్ Published on 12 May 2020 3:59 PM GMTకరోనా వైరస్ కారణంగా క్రీడారంగం కుదేలైంది. ఈ మహమ్మారి దెబ్బకి చాలా టోర్నీలు వాయిదా పడగా.. మరికొన్ని టోర్నీలు రద్దు అయ్యాయి. బీసీసీఐ మానస పుత్రిక ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) -13వ సీజన్ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం మార్చి 29న ప్రారంభం కావాల్సి ఉండగా.. కరోనా ముప్పుతో ఏప్రిల్ 15కి వాయిదా వేశారు. దేశంలో లాక్‌డౌన్ ఏప్రిల్ 15 తరువాత కూడా కొనసాగుతుండడంతో ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడింది.
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో ఐపీఎల్ జరిగేలా కనిపించడం లేదు. ఒకవేళ టోర్నీలోని మ్యాచ్‌లను కుదించి మినీ ఐపీఎల్‌ను నిర్వహించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే.. ఈ ఏడాది ఆసియాకప్, టీ20 వరల్డ్ కప్ ఆతరువాత ఈ ఏడాది చివర్లో ఆసీస్ లో టీమ్ఇండియా పర్యటించాలి. ఈ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణ కష్టమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఐపీఎల్ రద్దు అయితే బీసీసీఐ పెద్ద మొత్తంలో నష్టపోనుందట.
బీసీసీఐకి విపత్కర పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఐపీఎల్‌ను రద్దు చేస్తే దాదాపు రూ.4వేల కోట్లు బోర్డు నష్టపోవాల్సి వస్తుందని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ అన్నారు. ఇంకా ఎక్కువగానే నష్టపోనుందన్నారు. ఈ ఏడాది ఐపీఎల్ ఉంటుందో లేదో ఇంకా ఖచ్చితంగా తెలియదన్నారు. ఒకవేళ ఐపీఎల్ నిర్వహించడం సాధ్యమేనైనా ఎన్ని మ్యాచులను నిర్వహించగలమో చెప్పలేమని, ఎన్ని మ్యాచులు కోల్పోతామో తెలిస్తేనే ఎంత నష్టం వస్తుందో తెలుస్తుందని, ఏదీ ఏమైనప్పటికి ఆటగాళ్ల, ప్రజల రక్షణే ముఖ్యమన్నారు.
బీసీసీఐ ఒప్పుకుంటే తమ దేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను నిర్వహిస్తామని ఇప్పటికే శ్రీలంక, దుబాయ్ లాంటి దేశాలు ముందుకు వచ్చాయి. కాగా బోర్డు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లను నిర్వహించాలని కొందరు సూచిస్తుండగా.. మినీ ఐపీఎల్ నిర్వహించాలని పలువురు మాజీలు అంటున్నారు. బీసీసీఐకి ఖాసుల పంట కురిపిస్తున్న ఐపీఎల్‌పై బీసీసీఐ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.