వచ్చేవారంలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత జట్టు ఎంపిక

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Oct 2020 11:35 AM GMT
వచ్చేవారంలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత జట్టు ఎంపిక

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) 2020 సీజన్‌ ముగిసిన వెంటనే విరాట్‌ నేతృత్వంలోని భారత జట్టు యూఏఈ నుంచి నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఎంతో కఠినమైన ఆసీస్ టూర్ కు వెళ్లేందుకు మరో మూడు వారాల సమయం మాత్రమే ఉంది. అయితే.. భారత జట్టు ఎంపికపై ఎలాంటి సమాచారం లేదు. ఈ విషయంపై బీసీసీఐ(భారత క్రికెట్‌ నియంత్రణ మండలి) దృష్టి పెట్టింది. వచ్చే వారం భారత జట్టును ఎంపిక చేయనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

ఆసీస్ పర్యటనలో టీమిండియా రెండున్నర నెలలు గడపనుంది. భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిరీస్‌ నిర్వహణ కోసం ఇప్పటికే బీసీసీఐ, క్రికెట్‌ ఆస్ట్రేలియా ఒక ఒప్పందానికి వచ్చాయి. నవంబర్‌ 27న మూడు టీ20ల సిరీస్‌ ఆరంభంకానుండగా.. డిసెంబర్‌ 4న మూడు వన్డేల సిరీస్‌ మొదలవనుంది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ డిసెంబర్‌ 17 నుంచి ప్రారంభంకానున్నట్లు సమాచారం. డే/నైట్‌ టెస్టు మ్యాచ్‌తోనే టెస్టు సిరీస్‌ మొదలుకానున్నట్లు తెలిసింది.

"తేదీలు మినహా వేదికలు, మ్యాచ్‌లు ఖరారయ్యాయి. కరోనా నేపథ్యంలో క్వీన్స్‌లాండ్‌ రాష్ట్రం నుంచి ఆమోదం కోసం క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఎదురుచూస్తోంది. అక్కడి నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే పూర్తిస్థాయి షెడ్యూల్‌ను తేదీలతో సహా సీఏ ప్రకటిస్తుంది." అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తెలిపారు. కాగా ఆస్ట్రేలియా కరోనా ప్రోటోకాల్ ప్రకారం టీమిండియా ఆటగాళ్లు 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండడం తప్పనిసరి. టీమ్‌ఇండియా కోచింగ్‌సిబ్బంది, సపోర్ట్‌ స్టాఫ్‌, టెస్టు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్లు పుజారా, హనుమ విహారి తదితరులు అక్టోబర్‌ ఆఖరి వారంలో యూఏఈకి వెళ్లనున్నారు. నవంబర్‌ 4న ఫస్ట్‌ బ్యాచ్‌ దుబాయ్‌ నుంచి ఆస్ట్రేలియా వెళ్లనుండగా.. ఐపీఎల్‌ ప్లేఆఫ్‌కు అర్హత సాధించిన జట్లలోని భారత ఆటగాళ్లు నవంబర్‌ 11ను ఆసీస్‌కు బయలుదేరుతారు.

Next Story