ధోని రీఎంట్రీ..! బీసీసీఐ హింట్ ఇచ్చిందా..!
By తోట వంశీ కుమార్ Published on 20 March 2020 4:54 PM ISTబీసీసీఐ ట్విట్టర్‌లో చేసిన ఓ పోస్టుతో ధోని ఫ్యాన్స్ పుల్ ఖుషీలో ఉన్నారు. 2019 ప్రపంచకప్ సెమీఫైనల్ తరువాత క్రికెట్‌కు కాస్త విరామం ప్రకటించాడు భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. కొంతకాలం దేశ సేవ చేసినా.. తరువాత తన స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి ఖాళీ సమయాన్ని గడుపుతున్నాడు.
ఇదిలా ఉంటే.. ధోని రిటైర్‌మెంట్‌పై ఇప్పటికే చాలా ఊహాగానాలు వినిపించాయి. బీసీసీఐ కూడా ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టులో ధోనికి చోటివ్వలేదు. దీంతో ధోని కెరియర్ ముగిసినట్లే అని చాలా మంది అనుకున్నారు. అయితే ధోని రిటైర్‌మెంట్‌పై ఇప్పటికే భారతకెప్టెన్ విరాట్‌కోహ్లీతో పాటు టీమ్‌ఇండియా కోచ్ రవిశాస్త్రి వివరణ ఇచ్చినప్పటికి ఊహాగానాలు ఆగలేదు. ఐపీఎల్‌లో రాణిస్తే ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ జట్టులో ధోనికి అవకాశం ఉంటుందని రవిశాస్త్రి చెప్పిన సంగతి తెలిసిందే.
ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాణించి రీఎంట్రీ ఇస్తాడని ధోని అభిమానులు బావించారు. అయితే వారి ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. కరోనా వైరస్ ముప్పుతో మార్చి 29న మొదలుకావాల్సిన ఐపీఎల్ ఏప్రిల్ 15కు వాయిదా పడింది. అయితే.. అప్పటికి పరిస్థితులు అదుపులోకి రావడం అనుమానంగానే మారింది. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ లేనట్లుగానే తెలుస్తోంది. ఐపీఎల్ రద్దు అయితే.. ధోని రీఎంట్రీ కష్టమే.
ఐపీఎల్ 2020 సీజన్‌లో ధోనీ ఫామ్ ఆధారంగా మళ్లీ భారత్ జట్టులోకి అతనికి చోటివ్వాలని తొలుత యోచించిన సెలక్టర్లు.. ఇప్పుడు ఐపీఎల్ రద్దయ్యే సూచనలు కనిపిస్తుండటంతో మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత ధోనీ ఫొటోని మళ్లీ బీసీసీఐ.. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. దీంతో.. ధోనీ రీఎంట్రీ మళ్లీ ఆశలు చిగురించాయి. ఇక రిటైర్‌మెంట్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు టీ20 ప్రపంచకప్ వేదికనే సరైనదిగా భావిస్తున్నాడట. దీంతో ధోని రీఎంట్రీ లాంచనమే అని పలువురు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.