జ‌ట్టుతోనే రోహిత్.. రెండు టెస్టుల‌కు కోహ్లీ దూరం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Nov 2020 2:53 PM GMT
జ‌ట్టుతోనే రోహిత్.. రెండు టెస్టుల‌కు కోహ్లీ దూరం..!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 13వ సీజ‌న్ ముగిసిన వెంట‌నే టీమ్ఇండియా కోహ్లీ సార‌ధ్యంలో సుదీర్ఘ ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. క‌రోనా మ‌హ‌మ్మారి త‌రువాత టీమ్ఇండియా ఆడ‌నున్న తొలి అంత‌ర్జాతీయ సిరీస్ ఇదే. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా 3 వ‌న్డేలు, 3 టీ20లు, 4 టెస్టులు ఆడ‌నుంది. ఇందులో ఓ డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ ఆడ‌నుంది. కాగా..ఈ సిరీస్‌కు హిట్‌మ్యాన్‌కు సెల‌క్ట‌ర్లు విశాంత్రి నిచ్చిన సంగ‌తి తెలిసిందే.

తొడకండరాల గాయం కారణంగా హిట్‌మ్యాన్‌ ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. దీనితో అతడి గాయాన్ని ఫిజియోలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రోహిత్ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించిన తర్వాత తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ స్పష్టం చేసింది. టీమ్ఇండియాతో రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పయనం కానున్నట్లు సమాచారం. ఐపీఎల్ ఫైనల్ అనంతరం నవంబర్ 11న జట్టుతో పాటు రోహిత్‌ను పంపించి.. ఫిజియో నితిన్ పటేల్ పర్యవేక్షణలో ఉంచుతారట. వన్డేలకు విశ్రాంతినిచ్చి.. టీ20 సిరీస్‌కు బరిలోకి దింపాలని బీసీసీఐ యోచిస్తోందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో జ‌రిగే ఆఖ‌రి రెండు టెస్టుల‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండ‌క‌పోవ‌చ్చున‌ని స‌మాచారం. అత‌డి స‌తీమ‌ణి అనుష్క శ‌ర్మ జ‌న‌వ‌రిలో ప్ర‌స‌వించే అవ‌కాశం ఉంది. ఇలాంటి స‌మ‌యంలో ఆమె వ‌ద్ద ఉండేందుకు అత‌డు పితృత్వ‌పు సెల‌వులు తీసుకొంటాడ‌ని బీసీసీఐ సీనియ‌ర్ అధికారి ఒక‌రు మీడియాకు తెలిపారు. సాధారణ పరిస్థితుల్లో అయితే.. కోహ్లీ భారత్‌కు వచ్చి తన బిడ్డను చూసి తిరిగి ఆస్ట్రేలియా‌ వచ్చేవరకు ఒక టెస్టు మిస్సయ్యేవాడు. బ్రిస్బేన్‌‌లో లాస్ట్‌‌ టెస్టులో ఆడేవాడు. కానీ, 14 రోజుల క్వారంటైన్‌‌ రూల్‌‌ అమల్లో ఉంటే మాత్రం అతను తిరిగి జట్టుతో కలవడం కష్టం' అని సదరు అధికారి అభిప్రాయపడ్డారు.

Next Story