వ‌చ్చే ఏడాది భార‌త్‌లోనే.. స్ప‌ష్టం చేసిన గంగూలీ

By సుభాష్  Published on  8 Nov 2020 9:02 AM GMT
వ‌చ్చే ఏడాది భార‌త్‌లోనే.. స్ప‌ష్టం చేసిన గంగూలీ

ఎన్నో అవాంత‌రాలు దాటుకుని యూఏఈ వేదిక‌గా జ‌రుగుతున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) తుది ద‌శ‌కు చేరుకుంది. మ‌రో రెండు మ్యాచ్‌లతో 13వ సీజ‌న్ పూర్తి కానుంది. ఆటగాళ్లను బయో బబుల్ లో ఉంచి.. చిన్న పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్త పడ్డారు ఐపీఎల్ నిర్వాహకులు. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఏప్రిల్- మే నెల‌లో నిర్వ‌హించే ఐపీఎల్ వాయిదా వేసి.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నిర్వహించారు.

అయితే వ‌చ్చే ఏడాది ఎప్ప‌టిలాగే భార‌త్‌లో నిర్వ‌హిస్తామ‌ని.. అది కూడా ఏప్రిల్‌, మే నెల‌లోనే జ‌రుపుతామ‌ని బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ స్ప‌ష్టం చేశాడు. ఈ ఒక్క‌ సీజ‌న్ మాత్ర‌మే యూఏఈలో నిర్వ‌హిస్తున్నామ‌ని వ‌చ్చే సీజ‌న్ ఖ‌చ్చితంగా భార‌త్‌నే కొన‌సాగిస్తామ‌ని చెప్పాడు. ఆటగాళ్ల కోసం బయో బబుల్ ఏర్పాటు చేస్తామని.. అప్పటి పరిస్థితిని బట్టి, ప్రేక్షకులను కూడా పరిమిత సంఖ్యలో అనుమతిస్తామని గంగూలీ వెల్లడించారు. ఇక ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటన కూడా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే రెండు, మూడేళ్ల‌లో మ‌హిళ‌ల టీ20ల్లోనూ ఏడెనిమిది జ‌ట్లు తీసుకొస్తామ‌న్నాడు.

ఆసీస్ టూర్ పై కూడా గంగూలీ స్పందించారు. టీమ్ఇండియా విజయావకాశాలు ప్రధానంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వ సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటాయని గంగూలీ అభిప్రాయపడ్డారు. చివ‌రిసారి కంగారూ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ప్పుడు 2-1తో సిరీస్ గెలిచిన సంగ‌తి తెలిసిందే. అప్పుడు వార్న‌ర్, స్టీవ్ స్మిత్ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం వారిద్ద‌రితో పాటు మార్న‌స్ ల‌బుషేన్ ఉండ‌డంతో.. ఈ సారి భార‌త్‌కు క‌ఠిన స‌వాల్ ఎద‌రుకానుంది. బౌల‌ర్ల‌ను స‌రిగ్గా ఉప‌యోగించుకోవాల‌ని, ఎవ‌రిని ఎప్పుడు ఎలా ఆడించాలో కోహ్లీనే చూసుకోవాల‌ని.. దానిపైనే భార‌త్ విజ‌యాలు ఆధార‌ప‌డి ఉంటాయ‌ని గంగూలీ వివ‌రించాడు.

Next Story