ముంబైని ఢీ కొట్టేదెవ‌రో..?  ఢిల్లీతో త‌ల‌ప‌డ‌నున్న హైద‌రాబాద్

By సుభాష్  Published on  8 Nov 2020 8:39 AM GMT
ముంబైని ఢీ కొట్టేదెవ‌రో..?  ఢిల్లీతో త‌ల‌ప‌డ‌నున్న హైద‌రాబాద్

తొలిసారి ఫైన‌ల్ చేరాలని ఆరాటప‌డుతున్న జ‌ట్టు ఓ వైపు. రెండో సారి ఫైన‌ల్ ఆడాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్న జ‌ట్టు ఇంకో వైపు. ఇది ఢిల్లీ క్యాపిట‌ల్స్, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్ల ప‌రిస్థితి. ఈ రెండు జ‌ట్లు ఆదివారం త‌ల‌ప‌డుతున్నాయి. మరీ ఏ జ‌ట్టు గెలిచి ఫైన‌ల్ చేరుతోందో..? ముంబైని ఢీ కొట్ట‌నున్న ఆ జ‌ట్టు ఏదో నేడు తేల‌నుంది.

శ్రేయాస్ కెప్టెన్ అయిన త‌రువాత ఢిల్లీ జ‌ట్టులో కొత్త ఉత్సాహం వ‌చ్చింది. యువ‌కుల‌తో కూడిన ఆ జ‌ట్టు బాగా రాణిస్తోంది. అయితే.. అనుభ‌వ లేమి ఆ జట్టు అవ‌కాశాల‌ను దెబ్బ‌తీస్తోంది. దీంతో ఈ సీజ‌న్‌కు ముందు శివ‌ర్ ధావ‌న్‌, అజింక్యా ర‌హానే తీసుకుంది. శిఖ‌ర్ రెండు సెంచ‌రీల‌తో మురిపించ‌గా.. అజింక్యా రహానే కీల‌క మ్యాచ్‌లో అర్థ‌శ‌త‌కంతో ఫామ్‌లోకి వ‌చ్చాడు. అయితే.. తొలి 9 మ్యాచ్‌ల్లో 7 విజ‌యాల‌తో అద‌ర‌గొట్టిన శ్రేయాస్ సేన.. ఆ త‌రువాత విఫ‌లమైంది. చివ‌రి లీగ్ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆప్ చేరింది. అయితే.. క్వాలిఫైయ‌ర్ 1లో ప్లే ఆఫ్స్‌లో ముంబైతో త‌ల‌ప‌డింది. ఆ మ్యాచ్‌లో క‌నీస పోరాట ప‌టిమ కూడా చూప‌లేక‌పోయింది. మార్కస్‌‌‌‌‌‌‌‌ స్టోయినిస్ త‌ప్ప మిగ‌తా ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్లు అంతా దారుణంగా విఫ‌లం అయ్యారు. దీంతో బౌల‌ర్లు కూడా ఏమీ అద్భుతాలు చేయ‌లేక‌పోయారు. పేసర్లు రబాడ(25 వికెట్లు), అన్రిచ్‌‌‌‌‌‌‌‌ నోకియా(20) అదరగొడుతుండ‌గా.. సీనియర్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ అశ్విన్‌‌‌‌‌‌‌‌(13 వికెట్లు) స్థాయికి తగ్గ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాడు. మరీ హైద‌రాబాద్‌తో మ్యాచ్‌లో ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల రాణింపు పైనే ఢిల్లీ విజ‌యావ‌కాశాలు ఆధార‌ప‌డి ఉన్నాయి.

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ప‌రిస్థితి భిన్నంగా ఉంది. వ‌రుస‌గా నాలుగు మ్యాచ్‌లు గెలిచి వార్న‌ర్ సేన జోరుమీదుంది. కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్‌, విలియ‌మ్ స‌న్ ఫామ్, మ‌నీశ్ పాండే, జేస‌న్ హోల్డ‌ర్ ఫామ్‌లో ఉన్నారు. సాహా గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. దీంతో శ్రీవత్స్‌ని కొనసాగించే అవకాశం ఉంది. ఇక బౌలింగ్ విష‌యానికి వ‌స్తే.. సందీప్ శ‌ర్మ‌, న‌ట‌రాజన్ పేస్‌తో ప్ర‌త్య‌ర్థిని బ్యాట్స్‌మెన్ ప‌ని ప‌డుతుండ‌గా.. స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్ చుక్క‌లు చూపిస్తున్నాడు. వీరంద‌రు మ‌రోసారి సమిష్టిగా చెల‌రేగితే.. మ‌రోసారి హైద‌రాబాద్ ఫైన‌ల్ చేర‌డం ఖాయం.

ఇక లీగ్ ద‌శ‌లో ఢిల్లీతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో కూడా స‌న్‌రైజ‌ర్స్ విజ‌యం సాదించడం ఢిల్లీ ఆత్మ‌విశ్వాసాన్ని దెబ్బ‌తీసేదే. అయితే.. అనిశ్చితికి మారుపేరైన టీ20లో విజ‌యం ఎవ‌రిని వ‌రించ‌నుందో..?

Next Story