'బాసర రైల్వే స్టేషన్‌'కు అరుదైన గుర్తింపు

By సుభాష్  Published on  21 Dec 2019 8:59 AM GMT
బాసర రైల్వే స్టేషన్‌కు అరుదైన గుర్తింపు

బాసర రైల్వేస్టేషన్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. స్వచ్ఛ నిర్వహణలో భాగంగా ఇప్పటికే ఎన్నోఅవార్డులు అందుకున్న ఈ బాసర రైల్వేస్టేషన్‌.. తాజాగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఐఎస్‌ఓ సర్టిఫికేట్‌ను సాధించి 9 రైల్వేస్టేషన్లలో ఒకటిగా నిలిచింది. కాగా, ప్రయాణికులకు మెరుగైన సేవలు, పరిశుభ్రత పాటిస్తున్న నేపథ్యంలో ఈ ప్రమాణాల ఆధారంగా ఈ సర్టిఫికేట్‌ దక్కించుకుంది. దక్షిణ మధ్య పరిధిలో వందలాది స్టేషన్లు ఉండగా, నాలుగు రాష్ట్రాల పరిధిలో ఉన్న జోన్‌లోని అనేక స్టేషన్లలో కేవలం తొమ్మిది రైల్వేస్టేషన్లకు మాత్రమే ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ దక్కింది.

ఇక తెలంగాణ నుంచి హైదరాబాద్‌, కాచిగూడ, సికింద్రాబాద్‌, బాసర, నిజామాబాద్‌, వికారాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌నుంచి విజయవాడ, కర్నూల్‌, మహారాష్ట్ర నుంచి పర్లివైద్యనాథ్‌ స్టేషన్లు మాత్రమే ఈ సర్టిఫికెట్‌ అందుకున్నాయి. జాతీయ హరిత న్యాయస్థానం సూచించిన ప్రమాణాలను అందుకోవడంతో ఈ సర్టిఫికేట్‌ పొందాయి. స్టేషన్ల సమర్థ నిర్వహణకు వచ్చిన ఈ గుర్తింపుతో బాసర స్టేషన్‌ అధికారులు, సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. బాసర రైల్వేస్టేషన్‌కు ఇలాంటి గుర్తింపు రావడంతో తమపై మరింత భారం పెరిగినట్లయిందని పేర్కొంటున్నారు. ప్రయాణికులకు మంచి సౌకర్యాలు అందించడమే ధ్యేయమని చెబుతున్నారు. ఇంకా మున్ముందు ప్రయానికులు మరిన్ని సౌకర్యాలు అందించి గుర్తింపు మరింత గుర్తింపు తెచ్చుకుంటామని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Next Story
Share it