'పింక్‌బాల్' జోరు.. బంగ్లా బేజారు..!
By Medi Samrat Published on 22 Nov 2019 5:05 PM IST
ముఖ్యాంశాలు
- ఇషాంత్ శర్మకు ఐదు వికెట్లు
- 106 పరుగులకే బంగ్లా ఆలౌట్
- టీమిండియా ప్రస్తుతం 21/0
టీమిండియా - బంగ్లాదేశ్ మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న డే-నైట్ టెస్టులో బంగ్లా బ్యాట్స్‌మెన్ 106 పరుగులకే చేతులెత్తేశారు. టీమిండియా బౌలర్లు ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, షమీలు బంగ్లా బ్యాట్స్‌మెన్‌కు పదునైన బంతులతో చుక్కలు చూపించారు. బంగ్లా ఒకానొక సమయంలో 100 పరుగుల లోపే ఆలౌట్ అవుతుందని అనుకున్నారు. అయితే, అతి కష్టం మీద 106 పరుగులు చేయగలిగింది.
ఇదిలావుంటే.. బంగ్లాదేశ్ ఆటగాళ్లలో ఓపెనర్ షద్మాన్ ఇస్లాం చేసిన 29 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. నలుగురు ఆటగాళ్లు డకౌట్ కాగా, ఇద్దరు కేవలం ఒక్కో పరుగు మాత్రమే చేశారు. మరో ముగ్గురు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. టీమిండియా బౌలర్లలో ఇషాంత్ శర్మ ఐదు వికెట్లు పడగొట్టగా.. ఉమేశ్ యాదవ్ మూడు, మహమ్మద్ షమీ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్, మయాంక్ లు ధీటిగా ఆడుతున్నారు. 3 ఓవర్లకు 21 పరుగులు చేశారు.