నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్ ను బంజాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ)ను బండ్ల గణేష్‌ తన అనుచరులతో కలిసి బెదిరింపులకు పాల్పడ్డాడని పీవీపీ జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో బండ్ల గణేష్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయ‌న‌ను అరెస్ట్ చేశారు.

గతంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘టెంపర్‌’ చిత్రానికి బండ్ల గణేష్‌ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఆ చిత్రానికి సంబందించి గ‌ణేష్ పీవీపీ నుండి రూ.7 కోట్లు ఫైనాన్స్‌ తీసుకున్న‌ట్టు స‌మాచారం. ఈ క్రమంలో రావలసిన సొమ్మును తిరిగి చెల్లించమని అడిగిన‌ పీవీపీని.. బండ్ల గణేష్ మ‌రియు అత‌ని అనుచ‌రులు కొంతమంది బెదిరింపులకు పాల్పడినట్టు పీవీపీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో ఐపీసీ సెక్షన్ 448, 506, రెడ్‌విత్‌ 34 కింద బండ్ల గణేష్‌తో పాటు నలుగురిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బండ్ల గణేష్‌ ను బంజారా హిల్స్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. కాసేపట్లో బండ్ల గణేష్  ను కడప మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారని సమాచారం. అరెస్ట్ వారెంట్ కు సంబంధించి కొన్నాళ్లుగా కడప మెజిస్ట్రేట్ ముందు హాజరు కాలేదు. దీంతో ఆయనను కడపకు తరలించనున్నట్లు సమాచారం.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.