కరీనంగర్‌ జిల్లాలో పోలీసులు అత్యుత్సహం ప్రదర్శించారు. ఆర్టీసీ డ్రైవర్‌ బాబు అంత్యక్రియల సందర్భంగా ఆర్టీసీ కార్మికులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బాబు అంతిమయాత్రలో పాల్గొన్న కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ను రామగుండం కమిషనరేట్‌లోని ఏఆర్‌ డీఎస్పీ నాగయ్య చొక్కా పట్టుకొని లాగారు. ఈ మేరకు బండి సంజయ్‌ పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. దీంతో సీపీ కార్యాలయం ముందు ఎంపీ బండి సంజయ్‌, కార్యకర్తలు నిరసనకు దిగారు. అదనపు డీసీపీ సంజీవ్‌ బండి సంజయ్‌ పట్ల అమర్యాదగా ప్రవర్తించారు. దీనిపై సీపీకి ఎంపీ బండి సంజయ్‌ ఫిర్యాదు చేశారు. సంజయ్‌పై పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించారంటూ బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్రిక్తతల మధ్య బాబు అంతిమయాత్ర కొనసాగింది. ఏఆర్‌ డీఎస్పీ నాగయ్య తనపై చేయిచేసుకున్నాడని ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు. ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ను పోలీసులు నెట్టివేశారు. దీంతో ఆయనకు తీవ్రగాయాలు అయ్యాయి. బండి సంజయ్‌పై చేయిచేసుకున్న ఏఆర్‌ డీఎస్పీ నాగయ్యను వెంటనే సస్పెండ్‌ చేయాలని బీజేపీ కార్యకర్తలు, ఎమ్మార్పీఎస్‌ శ్రేణులు, ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. మాజీ ఎంపీ వివేక్‌, మంద కృష్ణ మాదిగ పోలీసు కార్యాలయాన్ని ముట్టడించారు.

పోలీసుల తీరు రజాకార్ల నిరంకుశతత్వాన్ని తలపించిందన్నారు ఎంపీ బండి సంజయ్‌. ఈ సందర్భంగా.. మాట్లాడిన ఆయన పోలీసులు తనపై చేయి చేసుకున్న ఘటనపై పార్లమెంట్‌లో ప్రివిలేజ్‌ మోషన్‌ పెడతానన్నారు. తెలంగాణలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకువెళ్తామన్నారు. కరీంనగర్‌లో జరిగిన పరిణామాలను కేంద్రహోంశాఖ సహయ శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర బీజేపీ చీఫ్‌ కె.లక్ష్మణ్‌ అడిగి తెలుసుకున్నారని తెలిపారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.