మహమ్మారిపై పోరాటంలో ప్రజలు జాగ్రత్తగా మ‌సులుకోవాలి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Aug 2020 11:37 AM GMT
మహమ్మారిపై పోరాటంలో ప్రజలు జాగ్రత్తగా మ‌సులుకోవాలి

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిపై పోరాటంలో ప్రజలు జాగ్రత్తగా మ‌సులుకోవాల‌ని సినీన‌టుడు నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ పోరులో ప్రభుత్వాలు భాధ్యతగా పని చేయాలని అదే సమయంలో ప్రజలు కూడా అంతే భాద్యతాయుతంగా ఉండి తమను తాము పరిరక్షించుకోవాలని ఆయన సూచించారు.

వాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, త్వరలోనే వాక్సిన్ రావాలని కోరుకుంటున్నానని బాలకృష్ణ పేర్కొన్నారు. ఇప్పటికే ప్లాస్మా బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నారని ఈ ప్లాస్మా వలన చాలా మంది ప్రాణాలు కాపాడగలుగుతున్నారని వివరించారు. అలానే కరోనా పట్ల భయం వదలి కరోనాను జయించాలని విజ్ఞప్తి చేశారు.

కార్య‌క్ర‌మంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ కు సంగారెడ్డి లోని మహేశ్వర మెడికల్ కాలేజ్ అండ్‌ హాస్పిటల్ తరఫున కోవిడ్ రక్షణ కవచాలైన పీపీఈ కిట్స్ మరియు ఎన్-95 మాస్క్ లు అందజేశారు. వీటిని హాస్పిటల్ తరపున బాలకృష్ణ.. మహేశ్వర మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్, చైర్మన్ టిజిఎస్ మహేష్ నుండి స్వీకరించారు. మొత్తం 1000 పీపీఈ కిట్లు, మరో 1000 ఎన్-95 మాస్క్ లను అందజేసింది.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. మహేష్ కోవిడ్ మహమ్మారితో పోరాటంలో చేస్తున్న సహాయం ఎంతో మేలు కలిగిస్తోందని ప్రశంసించారు. మెడికల్ కాలేజీగా వైద్య చికిత్సకే పరిమితం కాకుండా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ మహేష్ గారు తన వంతు పాత్ర పోషిస్తున్నారని బాలకృష్ణ అన్నారు.

ముఖ్యంగా కోవిడ్ కారణంగా క్యాన్సర్ చికిత్స నిలిపివేయలేమని ఈ విషయంలో తమ సంస్థ(బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్) వైద్యులు, సిబ్బంది చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. వైద్యులు, సిబ్బంది కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకొన్నామని.. చికిత్స కు వచ్చే ప్రతి వ్యక్తిని ముందుగా స్క్రీన్ చేస్తున్నామని ఒక వేళ ఎవరిమీద‌న్న సందేహం వస్తే వారిని పరీక్షా కేంద్రానికి పంపిస్తున్నామని అన్నారు.

షూటింగ్ లకు ప్రభుత్వ అనుమతి ఇపుడే వచ్చిందని.. త్వరలోనే దీనిపై పరిశ్రమ పెద్దలందరూ కూర్చుని చర్చించుకొని నిర్ణయం తీసుకొంటామని బాలకృష్ణ అన్నారు. షూటింగ్ లు అంటే చాలా మంది ఉంటారని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకొంటామని చెప్పారు.

Next Story