బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై రేపు తుది తీర్పు

By సుభాష్  Published on  29 Sept 2020 12:18 PM IST
బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై రేపు తుది తీర్పు

దేశ రాజకీయ, సామాజిక వ్యవస్థను మార్చేసిన 28 ఏళ్లనాటి బాబ్రీ మసీదు కేసులో లక్నో సీబీఐ కోర్టు రేపు (సెప్టెంబర్‌ 30) తీర్పు వెలువరించనుంది. 1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై విచారణ జరుపుతున్న సీబీఐ కోర్టు తుది తీర్పు తేదీని ప్రకటించింది. సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్‌కె. యాదవ్ బుధవారం తీర్పు ఇవ్వనున్నారు. ఈ కేసులో నిందితులుగా పేర్కొంటూ బీజేపీ అగ్రనేతలు ఎల్‌.కె అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీ, పార్టీ సీనియర్‌ నేత ఉమా భారతి తదితరులు కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే 1992 డిసెంబర్‌లో వీరి కుట్ర ఫలితంగానే 15వ శతాబ్దం నాటి బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిందని ప్రధాన ఆరోపణ ఉంది.

గత జులై 24న అద్వానీ ఈ కేసులో ప్రత్యేక సీబీఐ కోర్టు ముందు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వాంగ్మూలాన్ని ఇచ్చారు. అంతకు ముందు రోజే జోషి కూడా తన వాదనలు వినిపించారు. ఈ కేసులో తమపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమని, తమ వైపు నుంచి ఎలాంటి తప్పులేదని పేర్కొన్నారు. అయితే సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సాగుతున్న ఈ కేసు విచారణను నానాటికి ఆలస్యమవుతూ వచ్చింది. పలుమార్లు వాయిదా పడింది. దీంతో విచారణను దాదాపుగా పూర్తి చేసిన సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించేందుకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో 30న కోర్టు తీర్పు ఇవ్వనుంది.

సాక్షులు, కీలక ఆధారాల పరిశీలించే తీర్పు

1992లో ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌ జిల్లాలోని అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీదును కరసేవకులతో కలిసి బీజేపీ అగ్రనేతలు కూల్చివేసినట్లు అభియోగాలు నమోదయ్యాయి. జిస్టిస్‌ లిబర్హాన్‌ కమిషన్‌ విచారణ, అనంతరం సీబీఐ విచారణ తర్వాత ఈ అభియోగాలపై సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రస్తుతం విచారణ జరుపుతోంది. ఇందులో భారీ సంఖ్యలో సాక్షులను విచారించడమే కాకుండా కీలక ఆధారాలను పరిశీలించిన ప్రత్యేక కోర్టు తీర్పు ప్రకటించనుంది. ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడిన తీర్పు ఈనెల 30న తుది తీర్పు వెల్లడించనుంది.

కాగా, ప్రస్తుతం సుప్రీం కోర్టు పర్యవేక్షణలో కొనసాగుతున్న ఈ కేసు విచారణ అనంతరం వచ్చే తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏ మాత్రం తేడా వచ్చినా తిరిగి సుప్రీంలో రివ్యూ పిటిషన్‌ వేసేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Next Story