మిగతా దేశంలో మన ఆటగాళ్లు మైదానంలో ఆటతో మోత మోగిస్తే, హైదరాబాద్ లో మాత్రం మాజీ ఆటగాళ్లు మైదానం బయట సంచలనాలు సృష్టిస్తున్నారు. అదీ వివాదాలు, విమర్శల ద్వారా. హైదరాబాదీ క్రికెట్ లెజెండ్ ఎం ఎల్ జయసింహ కుమారుడు వివేక్ జయసింహ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజహరుద్దీన్, సెక్రటరీ విజయానంద్ లపై సంచలన ఆరోపణలు చేశాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జూనియర్స్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా ఉన్న వివేక్ టీమ్ సెలక్షన్ లో అజహర్ జోక్యం చేసుకున్నాడని, తమకు తెలియకుండా టీమ్ ను మార్చేశాడని ఆరోపించాడు. బీసీసీఐ ఎథిక్స్ కమిటీ ఆఫీసర్ డీ కే జైన్ కి, ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ హితేశ్ మజుందార్ కు ఆయన లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. తాము ఆటగాళ్లను, మేనేజర్లను, సపోర్ట్ స్టాఫ్, స్టాండ్ బైలను ఎంపిక చేయాల్సి ఉండగా, సెక్రటరీ జోక్యం చేసుకుని, తమను బెదిరిస్తున్నాడని ఆయన ఆరోపించారు. టీమ్ లో ఉండే అర్హత లేని ఆటగాళ్లను టీమ్ లోకి అజహర్ జొప్పిస్తున్నాడని ఆయన ఆరోపించారు.

శుక్రవారం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో జరిగిన కూచ్ బిహార్ అండర్ 19 టోర్నీ కి తాము ఎంపిక చేసిన టీమ్ కి బదులు ముగ్గురు వేరే ఆటగాళ్లు ఆడారని ఆయన ఆరోపించారు. దీనిపై స్పందిస్తూ సెక్రటరీ విజయానంద్ ముగ్గురు ఆటగాళ్లను కొత్తగా జోడించిన మాట వాస్తవమేనని, అజహర్ వివేక్ తో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దుతానని తనకు చెప్పినట్టు తెలిపారు.

సెలక్షన్ టీమ్ లో శివాజీ యాదవ్, నోయెల్ డేవిడ్, అబ్దుల్ అజీమ్, రాజీవ్ యాదవ్, వివేక్ లు ఉన్నారు. తాము ఎంపిక చేసిన మేనేజర్, కోచ్ లను కూడా అజహర్ మార్చేశాడని వారు ఆరోపించారు. అండర్ 16, అండర్ 19, అండర్ 21 టీమ్ ల ఎంపికలో తమపై తీవ్ర ఒత్తిడి, బెదిరింపులు, హెచ్చరికలు వచ్చాయని, బ్లాక్ మెయిలింగ్ చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.

క్రికెట్ నిర్వాహకులు, క్లబ్ సెక్రటరీలు, సపోర్ట్ స్టాఫ్, కోచ్ లు లాలూచీ పడ్డారని, కొన్ని సందర్భాల్లో ఆటగాళ్లు కూడా కుమ్మక్కయ్యారని వారు అరోపించారు. ఆటగాళ్లకు టీమ్ లో చోటు కల్పించేందుకు డబ్బులు తీసుకుంటున్నారని కూడా ఆయన అన్నారు. మరో వైపు శివాజీ యాదవ్ కూడా ఇలాంటి ఆరోపణలే చేస్తూ లిఖిత పూర్వక ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.