కశ్మీర్ పై జేషే పడగ -2

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Oct 2019 3:06 PM GMT
కశ్మీర్ పై జేషే పడగ -2

వాస్తవానికి 1999 వరకు కూడా మసూద్ అజర్ పేరు ప్రపంచానికి పెద్దగా తెలీదు. కాందహార్ హైజాక్ ఘటన తర్వాతే మసూద్ పేరు ప్రపంచ వ్యాప్తంగా పరిచయమైంది. ఇక భారతీయ విమానాన్ని హైజాక్ చేసి మసూద్ అజర్ ను భారత జైలు నుంచి విడిపించిన వ్యక్తుల్లో మసూద్ బావమరిది యూసఫ్ అజర్ కూడా ఉన్నాడు. మొన్నటి భారతీయ వైమానిక దళం కాల్పుల్లో చనిపోయినవారిలో యూసఫ్ అజర్ కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని పక్కకుపెడితే, భారత చెర నుంచి తప్పించుకొని పాకిస్థాన్ చేరుకున్న మసూద్ అజర్, అల్‌ ఖైదా నాయకుడు ఒసామా బిన్‌ లాడెన్‌, తాలిబన్‌ నాయకుడు ముల్లా మహ్మద్‌ ఒమర్‌లతో మంతనాలు జరిపాడు. ఉగ్రనాయకులతో చర్చలన అనంతరం జైష్-ఏ-మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థకు పురుడుపోశాడు. ఆ జైషే మహ్మదే ఇటు మనదేశంలో, అటు ఇరాన్ లో, మరోవైపు ఆఫ్ఘనిస్థాన్లో రక్తపు టేరులు పారించింది.

జైష్-ఏ-మహమ్మద్ అంటే మహ్మద్ సైన్యం అని అర్ధం. కశ్మీర్ ను భారతదేశం నుంచి విడగొట్టాలన్నది మసూద్ అజర్ ప్రగాఢ వాంఛ. భారత దేశంతో సూటిగా తలపడి గెలవలేమనే విషయం బాగా తెలిసిన మసూద్ ఉగ్రదాడులతో రక్తపుటేరులు పారించి దేశంలో అల్లకల్లోలం సృష్టించే దిశగా ఎన్నో దాడులు చేయించాడు. 1999లో జైష్-ఎ-మహమ్మద్ సంస్థను స్థాపించిన మసూద్, 2001 అక్టోబర్‌లో జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీపై ఆత్మాహుతి దాడి చేయించాడు. ఆ దాడిలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. 2001 డిసెంబర్‌ 13న జైషే ఉగ్రవాదులు ఏకంగా భారత పార్ల మెంట్‌పై దాడి చేసి 10 మందిని పొట్టన పెట్టుకున్నారు. 2016లో పఠాన్‌కోట్‌ వైమానిక దళ స్థావరంపై జరిగిన ఉగ్ర దాడులకు కూడా మసూద్‌ అజరే సూత్రధారి. జమ్మూకశ్మీర్‌లోని యూరీ సైనిక శిబిరంపై ఉగ్రవాదులు దాడి చేయడంతో 19 మంది భారత సైనికులు మృతి చెందారు. ఈ మారణహోమానికి కూడా మసూద్ అజరే కారకుడు.

ఇక, 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో 40 మందికిపైగా సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన బెట్టుకున్న ఉగ్రదాడి వెనక కూడా మసూద్ అజర్ మంత్రాంగమే ఉంది.మహ్మద్ సైన్యం పేరుతో ఉగ్రవాద సైన్యాన్ని తయారు చేయడానికి మసూద్ అజర్ పెద్ద ప్రణాళికే రచించాడు. భవహాల్ పూర్, బాలాకోట్, ముజఫరాబాద్, చకోటీలతో పాటు పీఓకే వెంబడి ఎన్నో టెర్రరిస్టు శిబిరాలను ఏర్పాటు చేశాడు. భవహాల్ పూర్‌లో 3 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన శిబిరం జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయం. బాలా కోట్‌లోని ఉగ్రస్థావరం జైషేకు సంబంధించి అతిపెద్ద శిబిరం. జైషేకు ఆల్ఫా కంట్రోల్ రూమ్‌గా, బిగ్గెస్ట్ టెర్రర్ లాంచ్ ప్యాడ్‌గా బాలకోట్ ఉగ్రవాద స్థావరం పేరు పొందింది. దాదాపు 7 ఎకరాల్లో ఉన్న ఈ శిబిరంలో వందలమంది యువ కులకు ఉగ్రవాద శిక్షణ ఇస్తారు. మసూద్ అజర్ బావమరిది యూసఫ్ అజర్ ఆధ్వర్యంలో ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చేవాడు.

అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించడం, బాంబులు విసరడం, గ్రనేడ్లు పేల్చడం, కాల్పులు జరపడం, ఐఈడీ తయారీ-అమర్చడం-పేల్చడం, సూసైడ్ దాడులకు వాహనాలను దొంగిలించడం, వాహనాలను హైజాక్ చేయడం, ఉగ్రవాద దాడులకు ప్లాన్లు రచించడం ఒక్కటేమిటి సమస్త జైషే ఉగ్రవాద కార్యకలాపాలకు బాలాకోట్ ఉగ్రశిబిరమే ప్రధాన కేంద్రం. సూసైడ్ బాంబింగ్‌లకు ప్రణాళికలు ఇక్కడే రూపొందుతాయి. అందుకే ఈ స్థావరాన్ని మన భద్రతా బలగాలు లక్ష్యంగా చేసుకొని నామరూపాలు లేకుండా చేశాయి.

రెండు దశాబ్దాలుగా మనదేశంలో కల్లోలాలకు మసూద్ అజర్ కారకుడిగా నిలిచాడు. అంతర్జాతీయ ఒత్తిడితో మసూద్‌ అజర్‌ను పాకిస్థాన్‌ గృహ నిర్బంధం చేసింది. ఐతే మసూద్‌కు వ్యతిరేకంగా ఆధారాలు లేవంటూ లాహోర్‌ హైకోర్టు తీర్పునివ్వడంతో 2002లో విడుదలయ్యాడు. ఐక్యరాజ్యసమితి 2002లో జైషేను నిషేధిత సంస్థల జాబితాలో చేర్చ డంతో పాకిస్థాన్ కూడా తూతూమంత్రంగా నిషేధం విధించింది. ఐతే మసూద్ అజర్‌ను మాత్రం అరెస్ట్ చేయలేదు. 2016లో పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై దాడి తర్వాత పాక్ అధికారులు మసూద్‌ను ప్రొటెక్టివ్ కస్టడీలోకి తీసుకున్నారు. కానీ అతనిపై కేసు నమోదు చేయలేదు. పైగా అతను దక్షిణ పంజాబ్‌ లో స్వేచ్చగా తిరుగుతున్నా, ఉద్రేకపూరిత ప్రసంగాలు చేస్తున్నా, భారీ ర్యాలీలు తీస్తున్నా చూసీ చూడనట్లు వ్యవహరించారు.

గత ఏడాది జులైలో పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో తన మద్దతుదారులనుద్దేశించి ఫోన్లో మాట్లాడిన మసూద్ తన వద్ద వందల సంఖ్యలో ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారని తెలిపాడు. ఈ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుతో పాటుముంబై దాడులకు కారణమైన లష్కరే తోయిబా ఉగ్రవాదులను అప్పగించాలని పాకిస్థాన్ సర్కారును భారత ప్రభుత్వం కోరింది. కానీ, దాయాది ప్రభుత్వం ఆ మాటను పెద్దగా పట్టించుకోలేదు. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్ర వాదిగా ప్రకటించాలంటూ భారత ప్రభుత్వం చేస్తున్న డిమాండ్‌కు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ మద్దతు తెలిపి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టినప్పటికీ, చైనా తన వీటో అధికారంతో అడ్డుకుంది.

పుల్వామా ఉగ్రదాడి తర్వాత సీన్ మారిపోయింది. జైషే ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడ్డారని పక్కా ఆధారాలు బయట కు రావడంతో మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాల్సిందే అని భారత ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌కు ప్రపంచ దేశాలన్నీ అండగా నిలిచాయి. అమెరికా మద్ధతుతో ఫ్రాన్స్, భద్రతామండలి లో తీర్మానం ప్రవేశపెట్టగా భద్రతామండలిలోని 15 సభ్యదేశాల్లో చైనా మినహా మిగతా అన్ని దేశాలు మద్దతు తెలిపాయి. చైనా మాత్రం మరోసారి పాతపాటే పాడింది. డ్రాగన్ కంత్రీపై మండిపడిన అమెరికా, ఫ్రాన్స్-బ్రిటన్‌లతో కలసి కొత్త తీర్మానం ప్రవేశపెట్టింది. ఓరకంగా ఇది నిర్బంధ తీర్మానమే. ఈ ప్రతిపాదనకు చైనా ఆమోదం తెలపడం తప్ప మరో మార్గం లేదు. ఇది, డ్రాగన్‌కు మంటపుట్టించింది. ఒత్తిడి తెచ్చి సమస్యను పరిష్కరించలేరని, చర్చలతో పరిష్కరించుకోవాలంటూ నంగనాచి మాటలు చెప్పింది. కానీ, చైనా తీరుతో విసిగిపోయిన ప్రపంచ దేశాలు, ఈసారి వెనక్కి తగ్గలేదు. దాంతో పరిస్థితిని అంచనా వేసిన చైనా ప్రభుత్వం, మసూద్‌ విషయంలో వెనక్కి తగ్గింది.

Next Story