కరోనా టెస్టు చేయించుకుంటే రూ.15వేలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 July 2020 8:06 PM IST
కరోనా టెస్టు చేయించుకుంటే రూ.15వేలు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ మహమ్మరి కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 1,57,16,043 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 6లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారి పేరు చెబితే.. వణికిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికి కొందరు పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు రావడం లేదు.

ప్రజలు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఓ అద్భుత ఆలోచన చేసింది. విక్టోరియా రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కరోనా అనుమానితులు పరీక్షలు చేయించుకుంటే.. $300 డాలర్లు ఇస్తామని ప్రకటించింది. అంటే మన కరెన్సీలో రూ.15,920 అన్నమాట. అంతేకాదు.. పాజిటివ్ గా వచ్చిన వారికి $ 1500 డాలర్లు అంటే.. మన కరెన్సీలో రూ.79,586 ఇస్తామని ఆ రాష్ట్ర సీఎం డేనియల్‌ ఆండ్రూస్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే.. కొన్ని షరతులు విధించారు.

ఉద్యోగ బాధ్యతలు నిర్వ‌హిస్తూ, గ‌తంలో ఎలాంటి అనారోగ్యంలేని ఉద్యోగుల‌కు ఈ అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన ఉద్యోగులు ఆర్ధిక సాయం పొందాల‌నుకుంటే త‌ప్ప‌ని స‌రిగా వారి పే స్లిప్ సమర్పించాల్సి ఉంటుంది. పే స్లిప్‌ను అందించలేని పక్షంలో, వారు చట్టబద్ధమైన పత్రాలను అందించాల్సి ఉంటుంది. కాగా.. చాలా మంది ప్రజలు కరోనా పరీక్షలు చేయించుకున్న తర్వాత కూడా ఇంట్లో ఉండటం లేదు. ఫలితం రాకముందే వీధి బాట పడుతున్నారు. వీటన్నిటికి అడ్డుకట్ట వేయడంతో పాటు, కరోనా బాధితుల్ని సులభంగా గుర్తించడానికి ఈ ఆర్థికసాయం ప్రకటిస్తున్నట్లు సీఎం డేనియల్‌ ఆండ్రూస్‌ వెల్లడించారు.

Next Story