చివరి వన్డేలో ఆసీస్ అద్భుత పోరాటం..
By తోట వంశీ కుమార్ Published on 17 Sep 2020 5:53 AM GMTఆస్ట్రేలియా ఇప్పటికే టీ20 సిరీస్‌ను కోల్పోయింది. వన్డే సిరీస్‌ను గెలిచి పరువు దక్కించుకోవాలని బావించింది. మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. ఇక చివదైన మూడో వన్డేలో గెలవడం తప్పని సరి. ఇలాంటి దశలో ఇంగ్లాండ్ జట్టు 302 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆసీస్ 73 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. దీంతో చాలా మంది ఆసీస్ ఓటమి తప్పదనుకున్నారు. ఈ దశలో అంత ఒత్తిడిలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్(108; 90బంతుల్లో 4పోర్లు, 7 సిక్సర్లు), వికెట్ కీపర్ కారే(106; 114బంతుల్లో 7పోర్లు, 2 సిక్సర్లు) అద్భుత పోరాటంతో.. ఆసీస్ మరో రెండు బంతులు మిగిలి ఉండగా విజయాన్ని అందుకుంది.
మాంచెస్టర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో 303 భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోర్ 21 పరుగుల వద్ద ఆరోన్ ఫించ్(12) ఔట్ అయ్యాడు. ఆ తరువాత డేవిడ్ వార్నర్(24), స్టొయినిస్(4), లబుషేన్(20), మిచెల్ మార్ష్(2) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. దీంతో ఆసీస్ 73 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. దీంతో ఆసీస్ అభిమానుల్లో కలవరం మొదలైంది. ఈ స్థితిలో ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, వికెట్ కీపర్ అలెక్స్ కేరీలు బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు. ఈ జోడి ముందుగా క్రీజ్‌లో కుదురుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆ తరువాత ఎడా పెడా బౌండరీలు బాదారు. కేరీ నిదానంగా ఆడగా.. మ్యాక్స్‌వెల్ బంతిని బాదడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. వీరిద్దరు ఆరో వికెట్ 212 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జట్టు స్కోర్ 285 వద్ద మాక్స్‌వెల్, 293 వద్ద కేరీ ఔట్ కాగా.. మిగిలిన లాంచనాన్ని కమిన్స్(4*), స్టార్క్(11*) పూర్తి చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్, రూట్ చెరో రెండు వికెట్లు తీయగా.. అర్బర్, రషీద్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో ఆసీస్ మూడు వన్డేల సిరీస్ 2-1తో కైవసం చేసుకుంది.
అంతముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ జేసన్ రాయ్ డకౌట్ అయినా.. మరో ఓపెనర్ బెయిర్ స్టో(112; 126 బంతుల్లో 12 పోర్లు, 2 సిక్సర్లు) అద్భుత శతకం బాదాడు. ఇయాన్ మోర్గాన్(23), బట్లర్(8) విఫలమైనా.. సామ్ బిల్డింగ్స్(57; 58బంతుల్లో 4పోర్లు, 2 సిక్సర్లు) క్రిస్ వోక్స్(53; 39బంతుల్లో 6పోర్లు) అర్థశతకాలు సాధించడంతో ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. స్టార్క్, జంపా చెరో 3 వికెట్లు పడగొట్టగా.. కమిన్స్‌కు ఓ వికెట్ దక్కింది.
ఇరు జట్ల సిరీస్ ముగియడంతో.. ఇంగ్లాండ్, ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్ 13వ లో పాల్గొనేందుకు యూఏఈ వెళ్లనున్నారు.