ఇకపై ఏటీఎంలలో ఓటీపీ నమోదు చేస్తేనే డబ్బులు

By సుభాష్  Published on  17 Sep 2020 11:02 AM GMT
ఇకపై ఏటీఎంలలో ఓటీపీ నమోదు చేస్తేనే డబ్బులు

ఎస్బీఐ ఏటీఎంలలో నగదు ఉపసంహరణకు కొత్త నిబంధన రేపటి నుంచి అమల్లోకి రానుంది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఎస్బీఐ ఏటీఎంలలో శుక్రవారం నుంచి ఓటీపీ ఆధారిత విత్‌డ్రాయల్‌ విధానం అమల్లోకి రానుంది. ఇకపై ఎస్‌బీఐ ఏటీఎంలలో నుంచి రూ.10వేల కంటే ఎక్కువగా విత్‌డ్రా చేయాల్సి ఉంటే అకౌంట్‌కు రిజిస్టర్‌ అయిన మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఒంటర్‌ చేస్తేనే డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ సదుపాయం సెప్టెంబర్‌ 18 (రేపు) నుంచి అందుబాటులోకి రానుంది. అయితే జనవరి 1 నుంచి వన్‌-టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) విధానాన్ని ఎస్బీఐ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎస్‌బీఐ ఏటీఎం కార్డుతో డబ్బులు డ్రా చేస్తే మాత్రం పీన్‌ నెంబర్‌తోపాటు ఓటీపీని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

రూ.10వేలు లేదా అంతకంటే ఎక్కువ డబ్బులను విత్‌డ్రా చేస్తే మాత్రం ఖాతాదారుడికి మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ నెంబర్‌ ఏటీఎంలోఎంటర్‌ చేస్తే క్యాష్‌ విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఓటీపీ ఆధారిత క్యాష్‌ విత్‌డ్రాలకు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య మాత్రమే వీలుండేది. ఇప్పుడు ఆ సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, అనాధికారక లావాదేవీలు, కార్డు స్కిమ్మింగ్‌, కార్డు క్లోనింగ్‌ వంటి మోసాలు జరుగకుండా ఉండేందుకు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చినట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. అయితే ఈ ఓటీపీ విధానం ఎస్బీఐ ఏటీఎంలలో మాత్రమే ఉంటుంది. ఇతర బ్యాంకు ఏటీఎంలలో ఈ విధానం వర్తించదని తెలిపింది.

Next Story
Share it